అసైన్డ్ భూములకు పట్టాలు!
● దొడ్డిదారిన హక్కుల బదలాయింపు ● పీఓటీ చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరుల పాగా ● స్థానిక గిరిజనులకు మాత్రం శూన్యహస్తం
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో పీఓటీ చట్టం, నిబంధనలు ఉల్లంఘించి అసైన్డ్ భూములను గిరిజనేతరులు పట్టాలు చేయించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు అందజేసిన వ్యవసాయ భూములు అన్యాక్రాంతం కావొద్దనే భావనతో అసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం(పీఓటీ)ను 1977లో తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ఉచితంగా భూములు పొందిన వారు సాగు చేసుకోవాలే తప్ప కౌలుకు ఇవ్వడం, అమ్మడం, దానం చేయడంపై నిషేధముంటుంది. అయితే, స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 1045ను 2004 డిసెంబర్‌లో తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం భూములు పొందిన పదేళ్ల అనంతరం కలెక్టర్ల ద్వారా ఎన్‌ఓసీ పొందితే అమ్ముకునే అవకాశం లభిస్తుంది. ఈ జీఓను సాకుగా చేసుకుని పలువురు అక్రమమార్గాల్లో పట్టాలు చేయించుకున్నారని తెలుస్తోంది.
300 ఎకరాలకు పైగా భూములు
దమ్మపేట మండలంలోని నల్లకుంట, జమేదారుబంజర, గుర్వాయిగూడెం, కొమ్ముగూడెం లింగాలపల్లి గ్రామాల్లో స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు 1970, 80 దశకాల్లో 273, 884, 1458 సర్వే నంబర్లలోని దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమిని పంపిణీ చేశారు. ఆ సమయాన భూములు అడవుల మాదిరిగా ఉండడంతో వారెవరూ సాగు చేసిన దాఖలాలు లేవు. దీంతో స్థానిక గిరిజనులే సాగు చేస్తుండగా ఇప్పుడు భూములు పొందిన వారికి అమ్ముకునే హక్కు కూడా లేదని స్థానికులు చెబుతున్నారు.
కొనుగోళ్లు, పట్టాలు
మండలంలోని పలు గ్రామాల్లో దాదాపుగా గిరిజనులే తరతరాలుగా జీవిస్తున్నారు. కానీ ఈ గ్రామాలు ఏజెన్సీ పరిధిలో లేకున్నా అధిక శాతం గిరిజనులు ఉన్నప్పటికీ ఇక్కడి అసైన్డ్ భూముల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసిన గిరిజనేతరులు దొడ్డిదారిన పట్టాలు చేయించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 1045 జీఓ ఆధారంగా యాజమాన్య హక్కు పత్రాలు పొందారని సమాచారం. కానీ భూములు పొందిన వారికి అమ్ముకునే హక్కు లేకున్నా జీఓ 1045 ఆధారంగా 1990 నుంచి 2020(ధరణి సైట్ ప్రారంభం) వరకు పలువురు గిరిజనేతరులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి పట్టాలు చేయించుకున్నారని సమాచారం. కాగా, ఆ భూములు స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితుల స్వాధీనంలో లేకున్నా కొనుగోలు చేసి పట్టాలు తెచ్చుకోవడం గమనార్హం. అయితే, కొందరు ధరణి సైట్ అందుబాటులోకి వచ్చాక జీఓ 1045 ఆధారంగా అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోగా, మరికొందరు రెవెన్యూ ఉద్యోగుల ద్వారా పట్టాలు పొందినట్లు సమాచారం.
గిరిజనులకు అందని పట్టా పుస్తకాలు
గిరిజన ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసిన గిరిజనేతరులు దొడ్డిదారిన యాజమాన్య హక్కులను పొంది ప్రభుత్వం ద్వారా రైతుబంధు సాయం అందుకుంటున్నారు. ఇదే సమయంలో అసలైన గిరిజన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఏ సాయమూ అందడం లేదు. పలు సర్వే నంబర్లలో 2020వ సంవత్సరంలో చేపట్టిన ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా వివరాలను రికార్డుల్లో పొందుపరిచినా సాగులో ఉన్న గిరిజన రైతులు చాలా మందికి పట్టాదారు పుస్తకాలు అందలేదు. ఇదేంటని ఆరాతీస్తే నిర్దేశిత సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణానికి మించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరయ్యాయని తెలుస్తోంది. కాగా, దమ్మపేట తహసీల్‌లో పనిచేస్తున్న ఓ అధికారి వ్యవసాయ బోరు వేయించుకునేందుకు అనుమతి కోరిన రైతు నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగినా విచారణ చేపట్టలేదు. ఇటీవల రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్‌కు సైతం సదరు అధికారి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అధికారుల సహకారంతో గిరిజనేతరులు పట్టాలు చేయించుకున్నట్లు సమాచారం.
విచారణ జరిపిస్తేనే ఫలితం
అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసి పట్టాలు పొందిన గిరిజనేతరుల వ్యవహారంపై విచారణ జరిపించాలి. తద్వారా గిరిజన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అలాగే, గతంలో చేసిన సర్వే ఆధారంగా గిరిజనులకు పాస్‌పుస్తకాలు ఇవ్వాలి.
– చాపా చలమరావు, లింగాలపల్లి
మా హయాంలో జరగలేదు
ఈ ప్రాంతంలో అసైన్డ్ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలను ఎవరికీ మా హయాంలో కేటాయించలేదు. ఈ అంశంపై మాకు ఫిర్యాదులు కూడా రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమగ్రంగా విచారణ జరిపించి చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు.
– వాణి, డిప్యూటీ తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment