రేపు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం ఖమ్మం చేరుకోనున్న ఆయన ఇక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించనున్న మంత్రి, 10గంటలకు పా ల్వంచ మండలం ప్రభాత్‌నగర్‌లో యానంబైలు – జిన్నగట్ట మధ్య హైలెవెల్ బ్రిడ్జి, పాండురంగాపురంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశాక లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర కళాశాలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలోని బెటాలియన్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశాక కొత్తగూడెంలో కమ్యూనిటీ హాల్, రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ఇందిరా మహిళా శక్తి ఫుడ్‌కోర్టును మంత్రి సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 3.45 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌లో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించనున్నారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెం, కాచిరాజుగూడెం, చింతపల్లి క్రాస్ వద్ద రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
నేటి నుంచి టెట్
ఖమ్మం సహకారనగర్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు(టీజీ టీఈటీ) పరీక్ష ఈనెల 2నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థుల కోసం ఖమ్మం జిల్లాలో ఏడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో హాజరుకావాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. కాగా, ఖమ్మం, రూరల్ మండలాల్లోని బొమ్మ ఇంజనీరింగ్ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల, ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల, సత్తుపల్లిలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలతో పాటు కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపాన విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
ప్రారంభమైన రోడ్డు
భద్రతా మాసోత్సవాలు
ఖమ్మంక్రైం: రవాణాశాఖ ఆధ్వర్యాన రోడ్డు భద్రతా మాసోత్సవాలు బుధవారం ప్రారంభమమయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఆర్‌టీఓ కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ వి.వెంకటరమణ మాట్లాడుతూ ప్రాణం కంటే విలువైనదేదీ లేదని వాహనదారులు గుర్తించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదాల బారిన పడితే కుటుంబాలకు తీరని నష్టం ఎదురవుతుందని చెప్పారు. ఈసందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్లు, సీట్‌బెల్ట్ ఆవశ్యకతపై వాహనదారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఏఎంవీఐ రెంటాల స్వర్ణలత, ఏఓ జావెద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
వయోజన విద్య డీడీగా శ్రీనివాసరెడ్డి?
ఖమ్మం సహకారనగర్: వయోజన విద్య డిప్యూ టీ డైరెక్టర్(డీడీ)గా శ్రీనివాసరెడ్డిని నియమితులైనట్లు తెలిసింది. జిల్లాలో పూర్తిస్థాయి అదన పు బాధ్యతలతో డీడీగా విధులు నిర్వర్తించిన జయశంకర్ గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆదిలాబాద్ వయోజన విద్య డీడీగా ఉన్న శ్రీనివాసరెడ్డిని ఖమ్మంకు కేటా యించినట్లు సమాచారం. ఆయన ఒకటి, రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు తెలిసింది.
నామినేటెడ్ పదవుల
పందేరం
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం నుంచి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరే సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం నియోజకవర్గంలో కీలక పదవులైన ఖమ్మం మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ చైర్మన్ పదవులు రఘునాథపాలెం మండల నాయకులకు దక్కనున్నట్లు సమాచారం. మార్కెట్ చైర్మన్‌గా వీ.వీ.పాలెంకు చెందిన మాజీ ఎంపీటీసీ యరగర్ల హన్మంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్‌గా బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి చిన్న వెంకటేశ్వర్లు పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈవిషయమై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment