పండుగ వేళ కో‘ఢీ’
సత్తుపల్లి: సంక్రాంతి వేళ పందెంకోళ్లు కత్తులు దూసుకున్నాయి. పండుగ మూడు రోజులు జూదం పురివిప్పింది. పందేలను చూసేందుకు, కాసేందుకు జిల్లా కేంద్రంతో పాటు ఏపీని సరిహద్దుగా ఉన్న సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల నుంచి పలువురు ఆంధ్రా వైపుకు పరుగులు పెట్టారు. అక్కడి కొన్ని బిర్రుల్లో పూర్తిగా సత్తుపల్లి ప్రాంత వాసులే ఉన్నారని తెలిసింది. అయితే, చాలామంది పందెంలో డబ్బు పోగొట్టుకోగా కొందరు మాత్రం సంతోషంగా బయటకు వచ్చినట్లు సమాచారం.
కోడిపందెం కంటే...
పండుగను పురస్కరించుకుని కోడిపందేల నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. అయితే, పందేల మాటున రూ.లక్షల్లో పేకాట, ఇతర జూదం నడిపించడంతో పలువురు జేబు లు గుల్ల చేసుకున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో జూదం నిర్వహించగా రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. కొన్నిచోట్ల మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పేకాట నడిచినట్లు తెలిసింది. గుండుపట్టాలు, పులిమేక, జూదంలోనూ పలువురు డబ్బు కోల్పోయారని సమాచారం.
సకల సౌకర్యాలు..
బిర్రుల వద్ద నిర్వాహకులు సకల సౌకర్యాలతో జూదరులను ఆకట్టుకున్నారని తెలిసింది. మద్యం, బిర్యానీ సమకూరుస్తూ ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని చెబుతున్నారు. జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్దసంఖ్యలో ఏపీకి వెళ్లడంతో కొన్ని బిర్రుల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే, జిల్లాలో మాత్రం కోడిపందేలు, పేకాట, ఇతరత్రా జూదాన్ని నియంత్రించడంలో పోలీసులు విజయవంతమయ్యారనే చెప్పాలి. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటుచేసి తెలంగాణ సరిహద్దుల్లో పందేలు లేకుండా నిలువరించగలిగారు. పాత నిందితులను బైండోవర్ చేయడమే కాక వారి కదలికలను గమనించడంతో ఎక్కడా పందేలా జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు.
తెలంగాణ – ఏపీ సరిహద్దుల్లో
జోరుగా పందేలు
ఏపీ బాట పట్టిన జిల్లావాసులు
రూ.లక్షల్లో నగదు కోల్పోయిన పలువురు
Comments
Please login to add a commentAdd a comment