ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం
తరలివచ్చిన భవానీలు, అయ్యప్పలు, శివ దీక్షధారులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భవానీలు, అయ్యప్పలు, శివ దీక్ష స్వీకరించిన భక్తులతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన రెండు షిఫ్టులు నిర్వహించగా, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, ఛండీహోమంలోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గత మూడు రోజులుగా మూసివేసిన ఘాట్‌రోడ్డును శుక్రవారం తెల్లవారుజాము నుంచి తెరిచి కొండపైకి ద్విచక్ర వాహనాలు, దేవస్థాన బస్సులను అనుమతించారు. ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద నుంచి చైనావాల్ వరకు భక్తుల ద్విచక్ర వాహనాలతో పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మల్లేశ్వరుని సన్నిధిలో..
అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలను వెలిగించారు. మల్లేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, సాయంత్రం ఆకాశ దీపంతో పాటు సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తీర్థయాత్రలు చేస్తున్న అయ్యప్పలు, యాత్రికులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment