చిన్న సారు... సర్వే గుబులు
‘అన్నగారూ... చిన్న సారు సర్వే చేయిస్తున్నారట. ఇదేమిటీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలే లేదు. వాటికి నిధుల కేటాయింపు లేదు. పథకాలు అమలు కాలేదని జనంలో వ్యతి రేకత వస్తోంది. పలు చోట్ల అడుగుతున్నారు. నా వద్దకు వచ్చే వారి పనులు చేయిద్దామంటే కావడం లేదు. పైగా నా పనులు కూడా సరిగా కావడం లేదు. ఏవైనా నిధులు వస్తే పనులు చేయించుకుందాం అనుకుంటున్నా. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనపై సర్వే ఏమిటో అర్థం కావడం లేదు. పైగా యువగళం టీం సభ్యులతో చేయిస్తున్నారట. ఏం చేయమంటారు..?’ ఇటీవలే ఓ ఎమ్మెల్యే తోటి ప్రజా ప్రతినిధి వద్ద వెళ్లబుచ్చిన ఆవేదన.
● ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి లోకేష్ రహస్య సర్వే ● యువగళం టీంలోని కొంతమందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు ● ఆరు నెలల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు ● నేతల సంపాదన, దోపిడీ, ప్రజా వ్యతిరేకతపై నివేదిక ● అవినీతి ఆరోపణలు, షాడో ఎమ్మెల్యేల పెత్తనంపైనా ఆరా ● జిల్లాలో ముగ్గురు ప్రజా ప్రతినిధుల పీఏలు, ఒకరి వారసుడి దందా ● సర్వేపై నేతల్లో ఆందోళన, అసంతృప్తి
సాక్షి, మచిలీపట్నం: ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం టీంతో సర్వే చేయిస్తున్నారన్న వార్త ఆ పార్టీ ప్రజాప్రతినిధుల్లో గుబులు రేకెత్తిస్తోంది. ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు, అక్రమాలు, ధనార్జనపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం యువగళం టీంలోని కొంత మందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది? ఏ మేరకు ప్రజలు విశ్వసిస్తున్నారు? అక్రమ ధనార్జన, మార్గాలు తదితర అంశాలపై నియోజకవర్గాల్లో రహస్య సర్వే ఇప్పటికే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నివేదిక ప్రామాణికంగా సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం కొందరు ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు. ప్రభుత్వ పనితీరును పక్కన పెట్టి.. తమపై సర్వేలు చేయించడం పట్ల అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్టు...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అక్రమార్జన వైపు అడుగులు వేస్తూ వచ్చారు. తమ సంపాదన కోసం దేనినీ వదలకుండా వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందే ఉన్న ఇసుక నిల్వలను తమ అనుకూల ప్రాంతాలకు తరలించుకుని అమ్ముకున్నారు. అధికారిక రీచ్‌ల ఖరారు జాప్యం కావడంతో తీర ప్రాంతంలోని ఇసుకను రాత్రి వేళల్లో జేసీబీ యంత్రాలతో తవ్వి తరలించారు. ఆ తరువాత మద్యం మాఫియా, సిండికేట్‌తో షాపుల కై వసం, బెల్ట్ షాపుల ఏర్పాటుతో పాటు ఉపాధి నిధుల ద్వారా రోడ్లు, ఇతర పనుల్లో వాటాల చొప్పున వసూలు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. దీనికి తోడు కొందరు మట్టి, ఇతర ఖనిజ సంపదను తరలించి మూటగట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
షాడో ఎమ్మెల్యేలు
జిల్లాలోని కొందరు ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరులు షాడో ఎమ్మెల్యేలుగా మారారు. ప్రతి ఫైలు, పని తమ ద్వారానే జరిగేలా చూసుకుంటున్నారు. ఉద్యోగుల నియామకానికి సిఫార్సుతో పాటు టెండర్లు, పనులు, చిరుద్యోగాల నియామకం, ఇసుక, మట్టి తరలింపు, ఉపాధి పనుల మంజూరు, బిల్లుల విడుదల, ఏజెన్సీల ఏర్పాటు వంటి వాటిపై ఆ ఎమ్మెల్యే కంటే ముందు పీఏల వద్ద డీల్ కుదిరితే.. అన్నీ వారే చక్కబెట్టేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే వారసుడు మరో ముందడుగు వేసి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పనులన్నీ చక్కబెడుతున్నారనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వ పాలనపై స్పష్టంగా ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకపైపు కూటమి నేతలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలితో విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలు నిర్వహించి, ర్యాంకులు ప్రకటిస్తే తమకు ఏ ర్యాంక్ వస్తుందో అనే ఆలోచనలో ఉన్నారు. గ్రాఫ్‌లో తక్కువ ర్యాంక్ వస్తే ప్రజల్లో నమ్మకం కోల్పోతామనే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రభుత్వంతో పాటు తమకూ మంచి పేరు, ర్యాంకు వస్తుందని చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment