వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి బెడ్‌లు(ఫైల్)
6 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలు బంద్!
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.54 కోట్ల బకాయిలు
వైఎస్సార్ సీపీ హయాంలో నిర్విరామంగా పేదలకు కార్పొరేట్ వైద్యం
గుడ్లవల్లేరు: పేదల సంజీవని ఆరోగ్యశ్రీ పథకంపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. ఉచిత వైద్యమే లక్ష్యంగా పేదలపై ఆర్థిక భారం పడకుండా కార్పొరేట్ ట్రీట్‌మెంట్‌తోపాటు శస్త్ర చికిత్సలు చేసేందుకు ఉద్దేశించిన పథకానికి కూటమి ప్రభుత్వం తీరుతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉపయోగపడేలా అమలైన సంగతి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చినా.. నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పేదల వైద్యంపై టార్గెట్ చేసి.. కక్ష సాధింపునకు సిద్ధమైనట్లుగా ఇప్పుడున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆరోగ్యశ్రీ పథకానికి గండి కొట్టేందుకు బాబు సన్నద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయిలను ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించక పోవటంతో ఆయా యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను 6వ తేదీ నుంచి నిలిపివేయడానికి నిర్ణయించాయి.
రూ.54 కోట్ల బకాయిలు
జిల్లాలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరిట పేదలకు ఉచితంగా వైద్యసేవలతోపాటు శస్త్ర చికిత్సలు చేసినందుకు దాదాపు రూ.54 కోట్లను ప్రభుత్వ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆరోగ్య శ్రీ పథకంలో పేదలకు అయ్యే వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో 3,257రకాల వ్యాధులకు చిక్సితలు జరిగేవి. వాటికి ఎప్పటికప్పుడు ఆయా ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఖర్చులు చెల్లించేవారు. గత ప్రభుత్వం చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత చెల్లింపులు మాత్రమే ఆగాయి. వీటితో కలిపి ఇప్పటివరకు రూ.54కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై పలుమార్లు ప్రైవేట్ ఆస్పత్రుల సంఘ ప్రతినిధులు నివేదిస్తున్నా.. కూటమి సర్కారు పట్టించుకోవటం లేదు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ ఆయా యాజమాన్యాలకు భారంగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన దిశలో ఉన్నాయి. కాని వేరే పేరిట అయినా...వైద్య సేవలను కూటమి ప్రభుత్వం అందించవచ్చని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.
పేదలకు అనారోగ్యం వస్తే ఇబ్బందే
ఆరోగ్యశ్రీ నిలిపివేస్తే.. పేదలకు అనారోగ్యం వస్తే.. ఎక్కడికి వెళ్లాలి. అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ పేదలకు అనారోగ్యం వచ్చిందంటే వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో వారికి వైద్య సేవలతో పాటు శస్త్ర చికిత్సలను కూడా అందించారు. జగనన్న పాలనలో పేదలంతా వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడలేదు.
– పడమటి సుజాత, వైఎస్సార్ సీపీ గుడ్లవల్లేరు మండల మహిళా అధ్యక్షురాలు
పేదల జీవితాలతో ఆటలా?
పేదల జీవితాలతో చంద్రబాబు ఆటలు ఆడుతున్నారు. ఆరోగ్యశ్రీని నిలిపి వేస్తే పేదల ఆరోగ్యానికి రక్షణ ఎలా? నాడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని అమలుచేస్తే దాన్ని సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి చేసి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంగా రూపొందించారు. నిరుపేదలు ఆస్పత్రికి వస్తే ఇంటికి వెళ్లేంత వరకు కంటికి రెప్పలా చూసుకున్నారు.
– మండలి హనుమంతరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment