మండలాల సమగ్రాభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని యాస్పిరేషనల్ మండలాల సమగ్రాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం యాస్పిరేషనల్ బ్లాక్‌ల అభివృద్ధిపై ఢిల్లీ నుంచి నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలోని యాస్పిరేషనల్ బ్లాక్ మండలాలు హొళగుంద, మద్దికెర, చిప్పగిరిలలో జరుగుతున్న అభివృద్ధిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాస్పిరేషన్ బ్లాకులలో జల జీవన్‌మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, అంగన్‌వాడీల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పించాలని సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ద్వారా గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని, ప్రధానమంత్రి అవాస్ యోజన కింద గృహాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులకు వ్యాధులు సంభవించకుండా టీకాలు వేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, గర్భిణులకు రక్త, షుగర్, టీబీ పరీక్షలు నిర్వహించి ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, ఇన్‌చార్జ్ సీపీఓ భారతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, డీఈఓ శామ్యూల్‌పాల్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment