స్టాళ్లు ఖాళీ..
సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
తొర్రూరు: ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, మాంసాహారం, చేపలు ఒకేచోట లభించే విధంగా గత ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి భవనం నిర్మించింది. గతేడాది మార్చి 8న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. కాగా అధికారులు, పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఆరుబయటనే విక్రయాలు చేపడుతున్నారు. మొదటి బ్లాక్‌లో కూరగాయల విక్రయాల నిమిత్తం 48 స్టాళ్లు ఏర్పాటు చేయగా దానిలో 24 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. రెండో బ్లాక్‌లోని 48 స్టాళ్లలో అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. క్రయవిక్రయదారులు లేక మార్కెట్ వెలవెలబోతుంది.
20గుంటల స్థలంలో..
రూ.4 కోట్ల టీయూఎఫ్‌డీసీ, ప్రణాళిక సంఘం నిధులతో 20 గుంటల స్థలంలో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనం ఆశించిన మేర సద్వినియోగం కావడం లేదు. పట్టణంలోని హరిపిరాలకు వెళ్లే రోడ్డులో తాత్కాలిక కూరగాయల దుకాణాలు, ఆయుర్వేద వైద్యశాలను తొలగించి భవనం నిర్మించారు. మొదటి అంతస్తులో కూరగాయలు, రెండో అంతస్తులో మాంసం, చేపలు, మూడో అంతస్తులో షాపింగ్‌మాల్ ఏర్పాటుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక రచించారు. కూరగాయలు, మాంసం విక్రయాలకు అనుగుణంగా రెండు బ్లాకులు నిర్మించారు. నిధుల లేమితో మూడో బ్లాక్ నిర్మాణం నిలిచింది. పాత కూరగాయల మార్కెట్ మొత్తం కొత్త దాంట్లోకి తరలించారు. మొదటి బ్లాకులో 48 స్టాళ్లలో 24 మాత్రమే కొనసాగుతున్నాయి. కూరగాయల విక్రయాలు సరిగా జరగకపోవడంతో ఆరుబయట అమ్మేందుకే వ్యాపారులు మొగ్గుచూపడంతో పలు స్టాళ్లు నిరుపయోగంగా మారాయి. రెండో బ్లాక్‌లోని 48 స్టాళ్లల్లో మాంసం, చేపల విక్రయాలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తాజాగా మార్కెట్‌ను సందర్శించి కూరగాయలతో పాటు ఇతర విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు.
రోడ్లపైనే అమ్మకాలు..
తొర్రూరులో పట్టణంలోని మార్కెట్‌ను వినియోగించకపోవడంతో రోడ్లపైనే కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మెయిన్ రోడ్డు, హరిపిరాల రోడ్డు, బస్టాండ్ సెంటర్, అన్నారం రోడ్డు, అంబేడ్కర్ సెంటర్ హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు కొనసాగిస్తున్నారు. మార్కెట్‌లో విక్రయాలు జరగవని భావించి వ్యాపారులు రోడ్ల పైనే అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెట్‌లో నిర్మించిన మూత్రశాలలకు నీటి సరఫరా లేక కూరగాయల క్రయవిక్రయాల కోసం వచ్చే స్థానికులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు గొంతు తడుపుకునేందుకు మంచినీటి సౌకర్యం సైతం మార్కెట్‌లో లేదు.
దుకాణాల కేటాయింపునకు కృషి
తొర్రూరులోని ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించి అన్నీ ఒకేచోట ఉండేలా చూస్తాం. రెండో బ్లాక్‌లో నాన్‌వెజ్ దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో మార్కెట్ కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.
–శాంతికుమార్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్
న్యూస్‌రీల్
అంతంత మాత్రంగానే
సమీకృత మార్కెట్ వినియోగం
96 స్టాళ్లలో 24 మాత్రమే వినియోగం
అసాంఘిక కార్యకలాపాలకు
అడ్డాగా మోడల్ మార్కెట్
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ రెండో బ్లాక్ ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. భవనం జూదరులు, మందు బాబులకు అడ్డాగా మారింది. ఖాళీగా ఉండటంతో రాత్రి వేళల్లో దాంట్లో మద్యం తాగడం, గుట్కాలు నమలడం, పేకాట ఆడటం వంటివి చేస్తున్నారు. ప్రాంగణం మొత్తం దుర్వాసన వస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. భవనంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రిని ధ్వంసం చేస్తున్నారు. అల్లరిమూకలు చేరి నానా రచ్చ చేస్తున్నారు. రాత్రి వేళల్లో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment