మిగిలింది 34 రోజులే..
మహహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ పాలక మండలి పదవీకాలం 34రోజుల్లో ముగియనుంది. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని పాలకవర్గం నిరాశలో ఉంది. పట్టణ ప్రగతి నిధులు రాకపోవడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ మున్సిపాలిటీకి ప్రకటించిన రూ.50 కోట్లు రాకపోవడంతో ఆశించినస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామని చాలా మంది కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవారు మాత్రమే వారి వార్డులో తిరిగి సమస్యలు ప రిష్కరించి, పనులు చేయిస్తున్నారు. పోటీచేయాలనే ఆలోచన లేని వారు వార్డులను గాలికి వదిలేశారు.
2020 జనవరిలో ఎన్నికలు..
2020 జనవరి 22న ఎన్నికల పోలింగ్, 25న లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికలకు ముందు మానుకోట మున్సిపాలిటీలో ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి, అనంతారం, బేతోలు, రజాలిపేట, శనిగపురం గ్రామాలను విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 28నుంచి 36కు పెరిగింది. ఈక్రమంలో రిజర్వేషన్లు మారాయి. ఎస్టీ 7, ఎస్సీ 5, బీసీ 6, జనరల్‌మహిళా 10, జనరల్ 8 చేశారు. చైర్మన్ జనరల్‌గా రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 19వార్డులు, కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, స్వతంత్రులు 3వార్డుల్లో గెలుపొందారు. జనవరి 27న కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, మహ్మద్ ఫరీద్ వైస్ చైర్మన్‌గాను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు.
వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం..
ఈ ఏడాది మార్చి 4న వైస్ చైర్మన్‌పై బీఆర్‌ఎస్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని తీర్మానం చేసి మున్సిపాలిటీతో పాటు కలెక్టర్‌కు తీర్మాన పత్రాలు అందజేశారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. అదే నెల 26నకార్యాలయంలో అవిశ్వాసం నెగ్గడంతో ఫరీద్‌ను వైస్‌చైర్మన్ పదవి నుంచి తొలగించారు. మార్నేని వెంకన్న ఏకగ్రీవంగా వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
వచ్చే నెల 26న ముగియనున్న పదవీకాలం..
2025 జనవరి 26న పాలకమండలి పదవీకాలం ముగుస్తుంది. 34 రోజుల వ్యవధి మాత్రమే. ఆతర్వాత ఎన్నికల వచ్చేంత వరకు ఇన్‌చార్జ్ పాలన కొనసాగుతుంది. 2023 జూన్ నుంచి పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ప్రతీనెల రూ.46లక్షలు వచ్చేది. ఆనిధులు నిలిచిపోవడంతో సమస్యలు పెరిగాయి. ఇతర ఎలాంటి నిదులు రాకపోవడంతో చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పాలక మండలిలో నిరాశే మిగిలింది. మాజీ సీఎం కేసీఆర్ 2023 జనవరి 12న సీఎం హోదాలో జిల్లాలో పర్యటించి మానుకోట మున్సిపాలిటీకి రూ. 50కోట్లు ప్రకటించారు. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. దీంతో ఆశించినంత అభివృద్ధి జరగలేదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం..
గత రెండు ఎన్నికల్లో రిజర్వేషన్లు మారాయి. ఈసారి కూడా రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రిజర్వేషన్లు మారితే గెలుస్తామా లేదా అనే అని ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న వార్డుల్లో అభివృద్ధి చేసిన వారు వార్డు మారితే చేసిన వార్డులో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తామని చెబుతున్నారు. కాగా జిల్లా కేంద్రం మానుకోట మున్సిపాలిటీ కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకుని పని చేసే అవకాశం ఉంది.
నిరాశలో మానుకోట మున్సిపాలిటీ పాలక మండలి
ఆశించినమేర అభివృద్ధి
చేయలేదని ఆవేదన
మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవారు మాత్రమే వార్డు సమస్యలపై దృష్టి
రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment