అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్ రూరల్: దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్యాంగ సారాంశాన్ని, రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి బీఆర్ అంబేడ్కర్‌ను కించపరిచారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
మహబూబాబాద్: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరన్న డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం జాతయ గణిత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వీరన్న మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. రిలేనిరాహార దీక్షలతో పాటు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఖాదర్, భాస్కర్‌రావు, రవి, గణిత ఉపాధ్యాయురాలు స్వాతి, మున్ని, సరస్వతి, నీలిమా తదితరులు పాల్గొన్నారు.
నేడు కిసాన్ మేళా,
వ్యవసాయ ప్రదర్శన
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన జరుగుతుందని కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి ఆదివారం తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్ సీఐసీఆర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన ప్రారంభమవుతుందని పేర్కొనారు. ముఖ్యంగా పత్తి పంటకు సంబంధించిన నూతన ఆవిష్కరణలు, వరి, మిర్చి, మొక్కజొన్న, పెసర, మినుములకు సంబంధించి సాగులో మెళకువల గురించి శాస్త్రవేత్తలు వివరిస్తారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కేయూలో ఐసెట్
కార్యాలయానికి సీల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని ఐసెట్ కార్యాలయానికి రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి తాళం వేసి సీల్ చేశారు. 12 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీయే టీఎస్‌ఐసెట్ నిర్వహించిన నేపథ్యంలో ఆ కళాశాలలో ప్రత్యేకంగా ఒక హాల్‌ను కార్యాలయంగా ఏర్పాటుచేసి అవసరమైన ఫర్నిచర్, టేబుళ్లు, కంప్యూటర్లు తదితర సామగ్రిని సమకూర్చారు. ఈసారి ఐసెట్ నిర్వహణను ఉన్నత విద్యామండలి కేయూకు అప్పగించకపోవడంతో ఐసెట్ కార్యాలయం నిరుపయోగంగా మారింది. ఈ కార్యాలయం నుంచి రెండు చైర్లు ఎవరో బయటికి తీసుకెళ్లారని ఆరోపిస్తూ రెండురోజుల క్రితం ఒకరు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో ఆయన కళాశాలను సందర్శించి ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ స్టాక్ రిజిస్టర్ మెయింటేన్ చేయటంలేదనేది గుర్తించిన రిజిస్ట్రార్.. ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్ రిజిస్టర్‌లో పొందుపరిచి కార్యాలయానికి తాళం వేయించారు. అందులోని వస్తువుల జా బితా పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అమరవేణికి అందజేసినట్లు ఆదివారం వెల్లడించారు.
ఐటీడీఏ ఎదుట ధర్నా
ఏటూరునాగారం: ఇటీవల ములుగు జిల్లాలో మావోయిస్టుల చేతిలో హతమైన బాధిత కుటుంబాలు ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై ఆదివారం ధర్నా నిర్వహించారు. అమాయక గిరిజనులను చంపినప్పుడు రాని మానవ హక్కుల సంఘాల నాయకులు మావోయిస్టులు చనిపోతే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మానవ హక్కుల సంఘాల తీరును మావోయిస్టు బాధిత కుటుంబాలు తప్పుబట్టారు. అనంతరం మావోయిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment