యేసు మార్గంలో నడవాలి
మహబూబాబాద్ రూరల్: యేసుక్రీస్తు మార్గంలో నడవాలని వరంగల్ క్యాథలిక్ పీఠాధిపతి, మేత్రాసనం మహాఘన బిషప్ ఉడుముల బాల అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామంలోని యేసుగుట్ట వద్ద ఆదివారం బంజారా మెగా కిస్మస్ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కరుణామయి మరియామాత పుణ్యక్షేత్రంలో బిషప్ ఉడుములబాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియామాతను ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకీలో భక్తులు ఊరేగించారు. భక్తి పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. మానుకోట ఫాతిమా మాత దేవాలయ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ సైమన్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాలకు ముఖ్య అతిథిగా బిషప్ ఉడుముల బాల హాజరై క్రీస్తు ఆరాధకులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో శాంతి నెలకొనేందుకు యేసు క్రీస్తు ఎంతో ఆరాటపడ్డారని, మనం కూడా క్రీస్తు చూపిన మార్గంలో నడవాలన్నారు. మనుషుల మధ్య సంబంధం, దేవుడికి భక్తులకు మధ్య సంబంధం మేలు జరిగే విధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖఃశాంతులతో జీవించాలని ప్రార్థించారు. వివాహం, కుటుంబం వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారన్నారు. క్రైస్తవ జీవితంలో బైబిల్ పఠనం మేలు చేస్తుందన్నారు. అనంతరం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, స్థానిక కౌన్సిలర్ బానోత్ హరిసింగ్, గునీలియన్ సుపీరియర్ ఫాదర్ రోనాల్డ్, టీసీబీసీ ట్రైబల్ సెక్రటరీ ఫాదర్ జోనస్, శనిగపురం యేసుగుట్ట ఫాదర్ పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
బిషప్ ఉడుముల బాల
Comments
Please login to add a commentAdd a comment