వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్
తుపాకీ, రెండు తూటాలు, ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్
మహబూబాబాద్ రూరల్: తుపాకీతో తిరుగుతూ హల్‌చల్ చేస్తున్న ఐదుగురు (గన్ గ్యాంగ్ ముఠా) నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఓ తుపాకీతో పాటు రెండు తూటాలు, ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ తెలిపారు. ఈ మేరకు టౌన్ పొలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు ఆపి అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
2020లో గంజాయి కేసులో మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లికి చెందిన అందెం గోపి, రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ భారతి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. అక్కడ వారిద్దరికి కేరళకు చెందిన జయరాం, ఒడిశాకు చెందిన చంద్రశేఖర్ పరిచయమయ్యారు. దీంతో జయరాం తనకు ఒక తుపాకీ కావాలని చంద్రశేఖర్‌ను అడగగా అతడు ఆ విషయాన్ని అందెం గోపికి తెలిపాడు. వెంటనే గోపి.. ప్రవీణ్ భారతికి చెప్పగా అతడు రాజస్థాన్‌కు చెందిన మరో వ్యక్తి ఇమ్రాన్ ఖాన్‌కు చెప్పగా అతడు గోపికి ఒక తుపాకీ, రెండు తూటాలు ఇప్పించాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ తనకు తుపాకీ వద్దని చెప్పగా అందెం గోపి, గోసామి ప్రవీణ్ భారతి, కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన మాధవపెద్ది శ్రీకాంత్ రెడ్డి, సీరోలు మండలం చింతపల్లికి చెందిన దొంతగాని సందీప్, వరంగల్ సమీపం భట్టుపల్లికి చెందిన మెరుగు సిద్ధార్థ (ఈ ముగ్గురు యువకులు గోపికి మిత్రులు) కలిసి ముఠాగా ఏర్పడి తుపాకీని అమ్మడానికి కారులో ప్రయాణిస్తున్నారు.
ఈ నెల 29న ఉప్పరపల్లి క్రాస్ వద్ద కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అందులో ఉన్న వ్యక్తులను అందులోకి తీసుకుని విచారించగా తుపాకీని అమ్ముదామని తిరుగుతున్నామని నేరం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడు ఇమ్రా న్ ఖాన్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కేసులో ప్రతిభకనబరిచిన మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజు, సీసీఎస్ ఎస్సై తాహెర్ బాబా, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, వివిధ విభాగాల డీఎస్పీలు మోహ న్, శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment