కాంట్రాక్ట్ సీఆర్‌టీల ధర్నా
రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
పదో తరగతి సిలబస్ పూర్తి కాక విద్యార్థులు ఇబ్బందులు
సమ్మెతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
మహబూబాబాద్ అర్బన్ : గిరిజన ఆశ్రమ పాఠశాలలో పాఠాలు జరగడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్‌టీ) తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏ పరిధుల్లో ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఫలితంగా సిలబస్ పూర్తి కాక పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్లుగా పని చేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే ఉద్యోగ భద్రత కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని భావించి సమ్మె చేస్తున్నామని సీఆర్‌టీలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, సీఆర్‌టీల సమ్మె ప్రభావం రానున్న పదో తరగతి వార్షిక పరీక్షలపై పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల వివరాలు
జిల్లా పాఠశాలలు సీఆర్‌టీల విద్యార్థుల
సంఖ్య సంఖ్య
ములుగు 37 55 7070
మానుకోట 25 109 6810
జనగామ 07 20 1151
వరంగల్ 07 24 మంది 1278
హనుమకొండ 07 16 851
భూపాలపల్లి 11 47 1657
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 1,500 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు.
డిమాండ్లు ఇవే..
● కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు మినిమమం టైంస్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి.
● సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలి.
● ప్రతి నెల 1న గ్రీన్‌చానల్ ద్వారా జీతాలు చెల్లించాలి.
● మహిళా టీచర్లకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు వర్తింపజేయాలి.
● ప్రమాదాల బారిన పడిప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
● పీఎఫ్ సౌకర్యం అందించాలి.
● 61 సంవత్సరాలు నిండిన సీఆర్‌టీలకు రూ. 20 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించాలి.
● సీఆర్‌టీలందరికీ హెల్త్‌కార్డు సౌకర్యం అందించాలి.
● మహిళా సీఆర్‌టీలకు చైల్డ్‌కేర్ సెలవులు మంజూరు చేయాలి
విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం..
ఆశ్రమ పాఠశాలో ఎస్జీటీలు 5వ తరగతి వరకు పాఠాలు బోధిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్లు స్థానంలో ఉన్న సీఆర్‌టీలు బోధిస్తారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సీఆర్‌టీల ధర్నాతో పదో తరగతిలో ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్ట్‌లో పూర్తి స్థాయిలో సిలబస్ కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌జీటీలు పాఠాలు చెప్పినా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి కీలక సమయంలో సీఆర్‌టీల సమ్మెతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment