నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..
వరంగల్ క్రైం: రూ.లక్ష అసలుకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈ మేరకు శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులనుంచి భారీ మొత్తంలో అసలు నోట్లు రూ.38.84లక్షలు, నకిలీ నోట్లు రూ.21లక్షలు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, కారు, ఆటో, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నకిలీ నోట్ల విక్రయం ఇలా..
ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రచించుకుని గొర్రెల వ్యాపారం ద్వారా పరిచయమైన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దొరికిందని, అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య, ఇతర సమస్యలు ఎదరవువుతున్నాయని నమ్మించాడు. ఎవరైనా రూ.లక్ష ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు రెండింతలు ఇస్తానని, అలాగే రూ.లక్ష అసలు ఇస్తే నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించేవాడు. ఇదే తరహాలో రెండో నిందితుడు ఎర్రగొల్ల శ్రీనివాస్‌తో పరిచయం కావడంతో కృష్ణ తన ప్లాన్ అమలు భాగంగా పాల్వంచ అడవిలో నకిలీ నోట్లతో భద్రపర్చిన డ్రమ్మునుంచి అసలు రూ.500నోట్ల కట్టని చూపించాడు. దీంతో అవి అసలు నోట్లని నమ్మిన శ్రీనివాస్ రూ.10లక్షల అసలు నోట్లగాను రూ.20లక్షలు, రూ.5లక్షల అసలు నోట్లకు రూ.20లక్షల నకిలీ నోట్లు మార్పిడి చేసుకునేందుకు నిందితుల ఇద్దరి మధ్య అంగీకారం కుదురింది. తనకు ఆ డబ్బును హనుమకొండకు తీసుకొచ్చి అందజేస్తేనే ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని శ్రీనివాస్.. కృష్ణకు షరతు విధించగా అంగీకరించారు. ఒప్పందం ప్రకారం ప్రధాన నిందితుడు కృష్ణ.. మరో నలుగురు నిందితులతో కలిసి కారులో శుక్రవారం కేయూసీ ఔటర్ రింగ్‌రోడ్డు, పెగడపల్లి క్రాస్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న శ్రీనివాస్ మరో ఇద్దరు నిందితులతో కలిసి అసలు డబ్బుతోపాటు నకిలీ నోట్లను మార్పిడి చేసుకుంటున్న తరుణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో ఈ ముఠా సభ్యులందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులు, కారు తనిఖీ చేయడంతో పెద్ద మొత్తంలో అసలు నగదుతో పాటు, నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలు లభించాయి. దీంతో విచారించగా నిందితులు తమ నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు సీపీ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కృష్ణ ఇదే తరహాలో మరో మిత్రుడితో కలిసి తెల్ల కాగితాలపై రూ. 5 వందల నోటు ముద్రించి పలుమార్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వీ.ఎం. బంజర, లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్‌ల్లో కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. కాగా, ఏసీపీ దేవేందర్ రెడ్డి, కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, ఎస్సై మా ధవ్, హెడ్‌కానిస్టేబుల్ నర్సింగ్ రావు, కానిస్టేబుళ్లు శ్యాంరాజు, సంజీవ్, సంపత్, హోంగార్డ్ రాజేందర్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఎనిమిది మంది సభ్యుల అరెస్ట్
రూ.38.84 లక్షలు అసలు..
రూ.21 లక్షలు నకిలీ నోట్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
సీపీ అంబర్ కి శోర్ ఝా
నిందితులు వీరే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, మోరంపల్లి బంజార గ్రామానికి చెందిన మణికాల కృష్ణ, నక్రిపేట తండాకు చెందిన ధరంసోత్ శ్రీను, అదే గ్రామానికి చెందిన తేజావత్ శివ, ముల్కలపల్లి మండలం మూకమామడి గ్రామానికి చెందిన గుగులోత్ వీరన్న, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్, ఉడుత మల్లేశ్, ఎర్రగొల్ల అజయ్, ఏపీలోని కర్నూల్ జిల్లా కుర్విపేట మండలం వేల్పనూర్ గ్రామానికి చెందిన బిజిని వేముల వెంకటయ్య అరెస్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment