గుర్తు తెలియని మృతదేహం లభ్యం
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన
డీఎస్పీ సత్యనారాయణ
ఉండవెల్లి: మండలంలోని భైరాపురం శివారు అలంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి దస్తగిరి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ సుబ్బారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏఎస్‌ఐ వివరాల ప్రకారం.. భైరాపురం శివారు అలంపూర్ రైల్వే స్టేషన్ సమీప రోడ్డుమార్గంలో గుర్తు తెలియని వ్యక్తి(60) మృతదేహం లభ్యమైంది. అతని వంటిపై తెల్ల బనిగిన్, తలబాగంలో గాయాలు, ఎడమ చేతి వేలుకు సిల్వర్ ఉంగరం, తలకు ఎర్రటి, నల్లటి వెంట్రుకలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ, అలంపూర్ ఎస్‌ఐ వెంకటస్వామి, ఇటిక్యాల ఎస్‌ఐ వెంకటేష్, ఉండవెల్లి ట్రైనింగ్ ఎస్‌ఐ సతీష్‌రెడ్డి పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి దస్తగిరి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మృతదేహం లభ్యం
జడ్చర్ల టౌన్: పుర పరిధిలోని క్లబ్‌రోడ్డు బీసీ వసతిగృహం వెనక నీటికుంటలో శనివారం మధ్యాహ్నం బుడగ జంగం బంగారయ్య (16) మృతదేహం లభించినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. తల్లి బంగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని.. 5 రోజుల కిందట శ్లోక స్కూల్ సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లి అందులో పడి మృతిచెంది ఉంటాడని వివరించారు.
కుక్కను తప్పించబోయి..
చెట్టును ఢీకొన్న బైక్
● యువకుడుమృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
మన్ననూర్: మన్ననూర్ సమీపంలోని లింగమయ్య స్వామి ఆలయం వద్ద శ్రీశైలం– హైద్రాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరవింద్, మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్‌కు చెందిన ఈశ్వర్ ఇద్దరూ కలిసి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మన్ననూర్ లింగమయ్యస్వామి ఆలయం సమీపంలో అకస్మాత్తుగా కుక్క బైక్‌కు అడ్డంగా రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అరవింద్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. వెనక కూర్చున్న ఈశ్వర్‌కు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: అప్పులబాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లాకేంద్రానికి చెందిన ముత్యాలుకు కొన్ని రోజులుగా అప్పులు ఎక్కువయ్యాయి. వాటిని తీర్చలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ గోవర్దన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment