అక్రమంగా ఉద్యోగాలు
ఆలయం వద్ద భక్తుల రద్దీ
సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట: నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్టుగా వస్తున్న ఆరోపణలు కందనూలు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, ఏఈఈ, డీఎస్సీ, అటవీశాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో కొందరు వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి చేరారన్న ఫిర్యాదులు ఊపందుకుంటున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేరారన్న ఫిర్యాదులపై ఇప్పటికే కలెక్టర్ సంతోష్‌కుమార్ సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మిగతా శాఖల్లో సైతం ఇదే తీరుగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలను పొందిన వారి చిట్టా విప్పుతూ నిరుద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
● హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పోలీస్, ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉండటంతో పాటు పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు కొత్తరకం దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికత కోసం హైదరాబాద్ జిల్లాలో చదువుకున్నట్టుగా నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు తయారుచేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగాలు పొందారని ఇందులో పదర మండలానికి ఓ ఉపాధ్యాయుడి పాత్ర ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. కాగా..అచ్చంపేట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఆడ్మిషన్ రిజిస్ట్రర్‌లో మార్పులు చేసినట్టు గుర్తించిన అధికారులు ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.
‘ఏజెన్సీ’ పేరుతో ఇతరులు..
నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర, బల్మూరు, అచ్చంపేట, లింగాల మండలాల్లోని కొన్ని గ్రామాలను ప్రభుత్వం ఏజెన్సీ ఏరియాగా గుర్తించింది. అయితే ఇతర జిల్లాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నకిలీ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు సమర్పించి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అటవీశాఖలో ఉద్యోగాలు పొందినట్టుగా ఫిర్యాదులు అందాయి. నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలు సమర్పించి ఇతరులు ఉద్యోగాలు పొందుతుండటంతో స్థానికులకు అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఈడబ్ల్యూఎస్ కోటా కింద అనర్హులు..
ప్రభుత్వం ఎకనామిక్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) కోటా కింద ఓసీ వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తోంది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 22 మంది ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగాలు పొందారు. వీరిలో కొందరు అనర్హులు కూడా సర్టిఫికెట్లు సమర్పించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినట్టు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి ఏడాదికి రూ.8 లక్షల లోపు వార్షికాదాయం, 5 ఎకరాల కన్నా తక్కువ భూమి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేనివారు, జీపీల్లో 200 గజాల లోపు ఇల్లు ఉన్నవారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కింద అర్హులు. కానీ జిల్లాలోని తెలకపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించి స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా ఉద్యోగం పొందాడు. అయితే అతని భార్య హైకోర్టులో ఉద్యోగం చేస్తుండగా, 16 ఎకరాలకు పైగా భూమి, హైదరాబాద్‌తో పాటు జిల్లాకేంద్రంలో భవనాలు, ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ బోనఫైడ్, ఏజెన్సీ ఏరియా, ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం సమర్పించి అక్రమంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పూర్తి స్థాయి విచారణ చేపట్టి సకాలంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ కొలువులు పొందిన వైనం
ఈడబ్ల్యూఎస్ కింద సర్టిఫికెట్లు పొందిన అనర్హులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసు, ఏఈఈ, జెన్‌కో, డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు
తాజాగా అటవీశాఖలో నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలతో చేరినట్లు సమాచారం
కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ
Comments
Please login to add a commentAdd a comment