అవినీతి, అక్రమాలపై అలుపెరగని పోరాటం
అభాగ్యులకు అండగా కథనాలు
స్పందించిన అధికారులు – అక్రమార్కులపై చర్యలు
పాలమూరు: నిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ‘సాక్షి’ దినపత్రిక ముందుంటుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ విభాగాల్లో అన్యాయాలు, అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. ఆపదలో ఉన్నవారికి సాయం అందేలా అండగా నిలిచింది. అక్షరాలనే ఆయుధాలుగా మలుచుకొని ఇచ్చిన కథనాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. నిబంధనలు అతిక్రమించిన ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకున్నారు. 2024లో ప్రజాసమస్యల పరిష్కారానికి అద్దం పట్టిన ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
● దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి భాగ్యలక్ష్మి డాక్టర్ కావాలని కలలు కనడమే కాదు.. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ అడ్మిషన్ కోసం రూ.1.40 లక్షలు అవసరమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ చదువుల తల్లికి ‘సాక్షి’ దారి చూపింది. అక్టోబర్ 8న ‘డాక్టర్ కలకు ఆర్థిక కష్టా లు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన దాతలు భాగ్యలక్ష్మి ఫీజుతో పాటు పుస్తకాల కోసం దాదాపు రూ.5.35 లక్షల విరాళాలు అందించారు.
● రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది దాదాపు 84.59 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటల సాగు జరిగిందని వివరిస్తూ ఆగస్టు 10న ‘సాక్షి’ ప్రధాన సంచికలో సాగు ఢమాల్ అనే శిర్షీకతో కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆగస్టు 11న మాచన్‌పల్లిలో రైతు మల్లు నర్సింహారెడ్డి వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు.
● జిల్లాకేంద్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెప్మా శాఖ పనితీరు సక్రమంగా లేకపోవడంతో పాటు చుట్టపుచూపుగా వస్తున్న మెప్మా పీడీ పనితీరును ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఆగస్టు 19న ‘మెప్మాకు దిక్కెవరు’ అనే శీర్షికతో కథనం ఇచ్చాం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించిన ఇన్‌చార్జి పీడీగా భూత్పూర్ మున్సిపల్ కమిషనర్‌ను నియమించారు.
● జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో దళారీలు, పైరవీకారులు చెప్పిందే అధికార యంత్రాంగం వింటూ పనులు చేస్తున్నారంటూ ఏప్రిల్ 16న ‘పైరవీకారులదే రాజ్యం’ పేరుతో కథనం ఇచ్చాం. వెంటనే స్పందించిన అధికారులు ధరణి ఆపరేటర్‌పై బదిలీ వేటు వేశారు.
● జడ్చర్ల పరిధిలో ప్రైవేట్ రియల్ ఏస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని ఏప్రిల్ 1న ‘అడ్డగోలుగా వెంచర్లు’ అనే కథనం ప్రచురితం కాగా.. దీనిపై ఏప్రిల్ 2న అక్రమ వెంచర్లపై అధికారులు చర్యలు చేపట్టారు.
● గండేడ్ మండల పరిధిలో ఎలాంటి అనుమతులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తూ భూగర్భజలాలు తగ్గుదలకు కారకులు అవుతున్నారని ఏప్రిల్ 3న ‘ప్రమాద ఘంటికలు’ అనే శీర్షికతో కథనం ఇవ్వగా.. అధికారులు స్పందించి అనుమతి లేకుండా బోర్లు వేసిన వారిపై చర్యలు తీసుకున్నారు.
● జడ్చర్ల మండలం గంగాపూర్‌కి చెందిన ఎడ్ల కల్యాణి పేరిట సర్వే నంబర్ 1074/ఈలో ఉన్న 2 ఎకరాల భూమిని ఆమె మేనమామ భార్య శంకరమ్మ మాయమాటలు చెప్పి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. దీనిపై బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ దినపత్రిక ఆగస్టు 4న ‘అక్కున చేర్చుకున్న వారే.. వంచన చేశారు’ అనే కథనం ప్రచురితం చేసింది. దీనిపై అధికారులు స్పందించి బాధితురాలి కల్యాణి పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందించారు.
● జడ్చర్ల మంచినీటి సమస్య తీవ్రతరం కావడంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. ఒకే మోటార్‌తో నీటి పంపింగ్ చేస్తున్నారని నవంబర్ 11న ‘జడ్చర్లలో నీటి సమస్య తీవ్రం’ అనే కథనం ఇచ్చాం. దీనిపై కలెక్టర్ విజయేందిర నవంబర్ 12న మల్లెబోయిన్‌పల్లిలో ఉన్న పంప్‌హౌజ్‌ను సందర్శించి స్టాండ్‌బై మోటార్లకు అనుమతులు ఇస్తూ నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment