● రూ.9 లక్షల టోకరా ● బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు ● జిల్లాకేంద్రంలో ఘటన
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకేంద్రంలోని కొత్త కుమ్మర్‌వాడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. కష్టపడి సంపాదించిన డబ్బులు సైబర్ నేరగాళ్లకు దారాదత్తం చేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో రూ.9లక్షలు చేజారిపోయాయి. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. ఆ ప్రైవేట్ ఉద్యోగి గత వారం క్రితం టెలిగ్రామ్ వచ్చిన ఓ యాడ్‌ను చూసి రూ.30 వేలు డబ్బులు వారికి పంపించాడు. వెంటనే రూ.36వేలు తిరిగి రావడంతో మరింతగా ఆశ పెంచుకున్నాడు. వారు ఇచ్చిన యాడ్‌లు చూసి ఇంటి వద్దే ఉంటూ వేల రూపాయలు సంపాదించవచ్చని అనుకున్నాడు. ఇలా తొమ్మిదిసార్లు రూ.లక్ష చొప్పున సైబర్ నేరగాళ్లకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించారు. వారం రోజులైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆయన గురువారం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో రూ.1లక్ష 2వేలు సీజ్ చేశారు. ఈ డబ్బులు మాత్రమే బాధితుడికి అందనున్నాయి. మిగతా డబ్బుల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. ప్రైవేట్ యాప్‌లు, లింక్‌లు, సైట్‌లను ఓపెన్ చేసి మోసపోవద్దని, సోషల్ మీడియాలో వచ్చే యాప్‌లను నమ్మి డబ్బులు పంపొద్దని సూచించారు. ఎవరైన మోసపోయిన వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment