యాసంగికి సాగునీరు
సాగుకు సిద్ధం కావాలి..
గూడెం ఎత్తిపోతల పథకం కింద యా సంగి పంట సాగుకు రైతులు ఆలస్యం చేయకుండా సిద్ధం కావాలి. ఎత్తిపోతల ద్వారా డిస్ట్రిబ్యూటరీ 30 నుంచి 42 వరకు సాగునీరు అందిస్తాం. అందరూ సన్నరకం వరి సాగు చేసుకోవాలి. అధికారులు, రైతులతో సమావేశమై త్వరలో నీటి విడుదల తేదీని ప్రకటిస్తాం.
– కొక్కిరాల ప్రేంసాగర్‌రావు,
ఎమ్మెల్యే, మంచిర్యాల
ఆరుతడి పంటలే వేసుకోవాలి..
కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు ఆరుతడి పంటలకే సరిపోతుంది. వరి వేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులతో మాట్లాడి, వీలైతే ఎస్సారెస్పీ నుంచి ఒక టీఎంసీ నీరు తెప్పించే ప్రయత్నం చేస్తాం. కడెం నీటి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం.
– విఠల్, ఈఈ, కడెం ప్రాజెక్టు
దండేపల్లి: ఈ ఏడాది కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో నిండడంతో వానకాలం పంటలకు సాగునీరందించా యి. ప్రస్తుతం ఉన్న మిగులు జలాలతో యాసంగి పంటలకు నీరు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కడెం ప్రాజె క్టు ద్వారా నిర్మల్ జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాలకు సాగునీరు అందుతుంది. యాసంగిలో క డెం నీటిని డిస్ట్రిబ్యూటరీ–1నుంచి 28 వరకు, ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను దండేపల్లి మండలం గూడెం గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా డిస్ట్రిబ్యూటరీ–30 నుంచి 42 వరకు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా..
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695 అడుగులు ఉంది. ప్రాజెక్టు కింద డిస్టిబ్యూటరీ–1 నుంచి 42 వరకు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉండగా, యాసంగి సాగుకు డిస్ట్రిబ్యూటరీ–1 నుంచి 28 వరకు సుమారు 16 వేల ఎకరాల వరకు ఆరు తడులుగా నీరు విడుదల చేస్తారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.56 టీఎంసీల నీరు ఉంది. గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల ద్వారా దండేపల్లి మండలం తానిమడుగు సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 30 నుంచి లక్సెట్టిపేట, హాజీపూర్ మండలం డిస్ట్రిబ్యూటరీ 42 వరకు సాగునీరు అందిస్తారు.
‘గూడెం’ ట్రయల్‌రన్ విజయవంతం
ప్రతియేటా యాసంగి సాగుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు డిస్టిబ్యూటరీ–30 నుంచి 42 వరకు సాగుకు అందిస్తున్నారు. ఈసారి కూడా ఎత్తిపోతల ద్వారా దండేపల్లి మండలం డీ–30 నుంచి లక్సెట్టిపేట, హాజీపూర్ మండలం కడెం ఆయకట్టు చివరి ప్రాంతం డిస్ట్రిబ్యూటరీ 42 వరకు సాగునీరు అందిస్తారు. ఎత్తిపోతల నీటిని ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించగా.. విజయవంతమైంది. త్వరలో ఎమ్మె ల్యే, అధికారులు, రైతులు సమావేశమై నీటి విడుదల తేదీని ప్రకటించనున్నారు. ప్రస్తుత యాసంగికి ఎల్లంపల్లి ప్రాజెక్టులోని 1.5 టీఎంసీ నీటిని సుమారుగా 18 వేల ఎకరాలకు పైగా అందిస్తారు.
బావులు, బోర్లకింద
వ్యవసాయ బావులు, బోర్ల కింద యాసంగి సాగు పనులను రైతులు ఇప్పటికే ప్రారంభించారు. కొందరు వరి నార్లు పోయగా, ముందుగా నార్లు పోసిన రైతులు నాట్లు వేస్తున్నారు. దీంతో బావులు, బోర్లకింద యాసంగి పనులు మొదలయ్యాయి.
నిండుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు
ఆరుతడికి కడెం ప్రాజెక్టు నీళ్లు
నీటి విడుదలకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment