విక్టరీలకు కేరాఫ్ అడ్రస్.. సింగిల్ హ్యాండ్‌తోనే భారీ బ్లాక్ బస్టర్స్‌ | Birthday Special: Interesting Facts About Victory Venkatesh - Sakshi
Sakshi News home page

విక్టరీలకు కేరాఫ్ అడ్రస్.. సింగిల్ హ్యాండ్‌తోనే భారీ బ్లాక్ బస్టర్స్‌

Published Wed, Dec 13 2023 3:06 PM | Last Updated on Wed, Dec 13 2023 4:30 PM

Happy Birthday Venkatesh: Interesting Facts About Victory Venkatesh - Sakshi

దగ్గుబాటి వెంకటేశ్.. ఈ పేరు కంటే విక్టరీ వెంకటేశ్ అంటే చాలు అందరూ గుర్తుపడతారు. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో  వెంకటేశ్. వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది. కానీ.. సొంత ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని రుజువు చేశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రి హవా నడుస్తున్న సమయంలో వచ్చినా.. తన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వ్యక్తి వెంకీ. అటు మాస్, ఇటు క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అభిమానులను తన నటనతో ఆకట్టుకున్న హీరో వెంకటేశ్‌ బర్త్‌డే నేడు(డిసెంబర్‌ 13). ఈ సందర్భంగా వెంకీ సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం. 

మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకుగా 1960 డిసెంబర్ 13న కారంచేడులో వెంకటేశ్ జన్మించారు. పెరిగిదాంత చెన్నైలోనే. అక్కడే డిగ్రీ వరకు చదువుకున్న వెంకటేశ్.. అమెరికాలో ఎంబీఏ ను పూర్తి చేశాడు. హీరో అవుదాం అని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామానాయుడు.. నిర్మాతగానే మిగిలిపోయారు. కానీ ఆ కోరికను తన కొడుకుతో తీర్చుకోవాలనుకున్నాడు. వెంకటేశ్ ను హీరో చేశాడు రామానాయుడు. దాంతో 1971లో బాలనటుడిగా ప్రేమ్ నగర్ నటించారు. ఆ తరువాత 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్నాడు వెంకటేశ్. 

కె.విశ్వనాథ్ వంటి దిగ్గజ డైరెక్టర్‌తో స్వర్ణకమలం లాంటి మ్యూజికల్ హిట్ సినిమాలో నటించాడు.ఆ సినిమాలో చేసినా నటనకు తెలుగు వెండితెర మీద తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘనవిజయం సాధించింది.1989లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్వర్ణకమలం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాతో వెంకటేశ్ కు మంచి గుర్తింపు వచ్చింది. 

1988లో వచ్చిన ప్రేమ సినిమాలో రొమాంటిక్ ప్రేమికుడిగా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాతో వెంకటేశ్ లోని రొమాంటిక్ హీరోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమా బాక్సఫిస్ బంపర్ హిట్ కొట్టింది. అంతేకాదు.. ఈ సినిమాకు గానూ వెంకటేశ్ నటనకు అవార్డుల పంట పండింది.

సురేష్ ప్రొడక్షన్ లో వచ్చిన బొబ్బిలిరాజా సినిమా కూడా వెంకటేశ్ నటనలో ఉండే విభిన్న కోణాన్ని చూపించింది. దివ్యభారతి, వెంకటేశ్ ల మధ్య ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా వెంకటేశ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. 

వెంకటేశ్ అంటే ఫ్యామిలి సినిమాలే ఎక్కువ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలే వెంకటేశ్ ను ఫ్యామిలి అభిమానులకు దగ్గర చేసింది. ముఖ్యంగా 1991 తెరకెక్కిన సినిమా చంటి... ఇది ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో అమాయక పాత్రలో వెంకటేశ్ నటన అద్బుతమే అని చెప్పాలి. అంతేకాదు.. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఇదే సినిమా హిందీలో అనాది పేరుతో రీమేక్ కూడా చేశారు. దాంతో వెంకటేశ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.   

వెంకటేశ్... సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా పవిత్రబంధం. సెంటిమెంట్, కామెడీ ని మిక్స్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో వెంకటేశ్ మహిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టున్నారు. దాంతో పాటు రాజాగా వచ్చి మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అంతేకాదు.. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు వంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నారు విక్టరీ. కలిసుందాం రా సినిమాతో ఫ్యామిలి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయంతోనే.. విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేశ్.

మల్టీస్టారర్ సినిమా అంటే ముందుండే వెంకటేశ్.. మరో సూపర్ స్టార్ హీరో మహేష్ తో కలిసి సినిమా చేసి ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. మంచి విజయం సాధించింది. రామ్‌ పోతినేనితో కలిసి..మాసాల మూవీలో వెండితెరను పంచుకున్నాడు వెంకటేష్. హిందీ సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ అశించిన విజయం సాధించలేదు.ఇక గోపాల గోపాల మూవీ కూడా మల్టీ స్టారర్ మూవీగా రూపొందిన మ్యాటర్ తెలిసిందే

యువ హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 మూవీలో నటించాడు.ఈ మూవీకి రెండో భాగం కూడా వచ్చింది.ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల ఆదరణ దొరికింది.ఇక అల్లుడు నాగచైతన్యతో కూడా .. వెండితెర మీద కూడా వెంకీ మామ అనిపించుకున్నాడు.ఈ మూవీ కూడా ఆడియన్స్‌ ఆకట్టుకుంది.

మాస్ హీరోగా మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలి అన్నది వెంకటేష్ గోల్ కాదు.కమర్శియల్ సినిమాలతో ఫేమస్ అవ్వాలి అన్న అభిప్రాయం కూడా లేదు.అన్ని రకాల పాత్రలతో..ఆడియన్స్ మనసుగెలుచుకోవాలి అనే లక్ష్యం..ఈ దగ్గుబాటి కుర్రాడిది.అందుకే..తెలుగువాళ్ల మనసు గెలుచుకొని,విక్టరీ హీరోగా అవతరించాడు.

విక్టరి వెంకటేశ్ తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు.1986 లో తన మొదటి సినిమాకే మేల్ డెబ్యూ గా నంది అవార్డు గెలుచుకున్నాడు. ఆయన ఎప్పుడూ తనకంటూ ఓ లోకాన్ని సృష్టించుకుని గీత దాటకుండా జీవిస్తారు. అనవసర విషయాల జోలికి వెళ్లరు. అలాగే సినిమా ఏదైనా.. కథని నమ్మి ఒకే చేస్తారు.  వెంకటేశ్‌ 75 వ సినిమా సైంధవ్‌ త్వరలోనే విడుదల కాబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement