మరో పది రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు..
అందుకే చరణ్, ఎన్టీఆర్‌ని ఎంచుకున్నా: రాజమౌళి
తారక్, చరణ్‌లను ఈ సినిమా కోసం ఎంచుకోవడానికి మొదటి కారణం వాళ్లకి ఉన్న స్టార్‌డమ్. అలాగే వారి వ్యక్తిత్వం, టాలెంట్ కూడా. నేను రాసుకున్న కథలో కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరని భావించా. అందుకే వాళ్లను తీసుకున్నా. చెర్రీ, తారక్ ఈ సినిమా నుంచి స్నేహితులయ్యారనేది అబద్దం. వాళ్లు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. ఇది కూడా వారి ఎంపికకు ఒక కారణం.
టైటిల్ ఏం అనుకోలేదు
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రారంభించిన సమయంలో ఎలాంటి టైటిల్‌ని అనుకోలేదు. మా ముగ్గురిని (రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్) దృష్టిలో ఉంచుకొని ఆర్‌ఆర్‌ఆర్ అని వర్కింగ్ టైటిల్ పెట్టాం. ఫ్యాన్స్‌కి అది బాగా నచ్చింది. అందుకే ఆ పేరునే ఫైనల్ చేశాం. అంతకు ముందు మేము ఎలాంటి టైటిల్‌ని అనుకోలేదు.
అందుకే రామ్ పాత్ర చరణ్‌కి ఇచ్చా
వయసును దృష్టిలో పెట్టుకొని తారక్‌ని కొమురంభీమ్‌గా, చెర్రీని అల్లూరిగా పెట్టుకోలేదు. రామ్ (అల్లూరి సీతారామరాజు)ఎంత అగ్నినైనా గుండెల్లో పెట్టుకొనే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. అది చరణ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా తొణకకుండా స్థిరంగా ఉంటాడు. అందుకే ఆ పాత్ర చరణ్‌కి ఇచ్చా. ఇక భీమ్(కొమరంభీమ్) పాత్ర ఎంతో అమాయకమైన వ్యక్తిది. పీలింగ్స్‌ని దాచుకోలేడు. అది తారక్‌లో కనిపిస్తుంది. అందుకే తారక్‌కు భీమ్ పాత్ర ఇచ్చా.
లుక్స్ చూసి ఆలియాను ఎంచుకోలేదు
లుక్స్ చూసి ఆలియాను సీత పాత్రకు ఎంచుకోలేదు. నేను రాసుకున్న కథలో సీత పాత్రకి.. ముఖం చూడగానే సాయం చేయాలనే అమాయకత్వం కనిపించాలి. అదే విధంగా నీరు, నిప్పు అనే ఇద్దరు వ్యక్తులను కంట్రోల్ చేయగలిగే మనోధైర్యం ఉండాలి. ఇవన్నీ ఆలియాలో ఉన్నాయి. అందుకే ఆమెను సీత పాత్రకి తీసుకున్నాం.
జక్కన్న లేకుంటే ఆర్‌ఆర్‌ఆర్ చేయకపోదును : ఎన్టీఆర్
ఆర్‌ఆర్‌ఆర్‌కు రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తే.. నేను నటించేవాడిని కాదు. ఇలాంటి కథ జక్కన్నకే సొంతం. ఏ దర్శకుడు ఆర్‌ఆర్‌ఆర్ లాంటి కథను రాసే సాహసం చేయడు(ఆర్‌ఆర్‌ఆర్‌కి వేరే దర్శకుడు అని ఆలోచించడం కూడా కష్టమేనని రామ్ చరణ్ అన్నారు). ఒకటి మాత్రం చెప్పగలను. ఇకపై మల్టీస్టారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. బలమైన కథలు వచ్చి, ఆ దర్శకుడు డీల్ చేయగలడు అనే నమ్మకం కలిగితే తప్పకుండా మల్టీస్టారర్ చేస్తా. మహేశ్‌బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలయ్య బాబాయ్, వెంకటేశ్.. ఇలా అందరితో కలిసి నటించాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment