రెగ్యులరైజ్ చేయాలని.. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల పోరాటం
ములుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) పరిధిలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు(కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు) 20 సంవత్సరాలుగా నిరాధారణకు గురవుతున్నారు. తమ తర్వాత విధుల్లోకి వచ్చిన హెల్త్ అసిస్టెంట్లను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది.. అదే సమయంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద పని చేస్తున్న తమను మాత్రం విస్మరించిందని వాపోతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రూ. 31వేల పే స్కేల్ అమలు చేస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం హామీ నేరవేర్చకుండానే అధికారం కోల్పోయింది. సమ్మె చేసిన సమయంలో ముందుకు వచ్చి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రెగ్యులరైజ్ చేయకపోవడంతో ఈ నెల 17వ తేదీన రాష్ట్రవ్యాప్త ధర్నాకు దిగి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు తమ బాధలు విన్నవించుకున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో సమ్మె నోటీస్ ఇచ్చిన ఏఎన్‌ఎంలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట గురువారం 48 గంటల నిరవధిక సమ్మెకు దిగారు.
రాత పరీక్ష నిర్వహించొద్దు
గతంలో రోల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా జిల్లాలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల 89 సబ్‌సెంటర్లలో 102 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. 2009లో చివరి సారిగా నియామకాలు జరిగాయి. అప్పటి నుంచి పోస్టుల ను భర్తీ చేయలేదు. 2023 జనవరిలో జోన్ల వారీ గా పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29న రాత పరీక్ష జరగనుంది. ఇది లా ఉండగా తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాలు మాత్రం 20 సంవత్సరాలుగా చేపడుతున్న విధులకు 50మార్కులు, ట్రైనింగ్‌లో పొందిన మా ర్కులను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో సమ్మె బాట పట్టారు. ఇప్పటి వరకు ఉన్న సర్వీస్‌ను సైతం పరిగణలోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు కోరుతున్నారు.
రెగ్యులర్ ఏఎన్‌ఎంలతో పాటుగా సమాన పని
పేరుకు మాత్రమే కాంట్రాక్ట్ ఏఎన్‌ఎం తప్పా రెగ్యులర్ ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ప్రతిరోజూ గ్రామాల వారీగా ఎంసీహెచ్, లెప్రసీ, టీబీ, ఐహెచ్‌ఐపీ, ఎన్‌వీబీడీసీ, ఎన్‌సీడీ, ఇమ్యునైజేషన్ టీకాల వంటి 32 రకాల కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వహించడంతో పాటు రికార్డులను మెయింటెనెన్స్ చేస్తున్నామని వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెగ్యులర్ మొదటి ఏఎన్‌ఎంలు లేని సబ్ సెంటర్‌లలో అన్నీ తామై పని చేస్తున్నామని అంటున్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల సమస్యలు
పరిష్కరించాలి
ములుగు రూరల్: కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టగా సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న ఏఎన్‌ఎంలు చాలీచాలనీ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. అదే విధంగా దీక్ష శిబిరాన్ని గురువారం రాత్రి ఎస్సై వెంకటేశ్వరరావు సందర్శించారు. శిబిరంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తన ఫోన్ నంబర్ సైతం ఇచ్చి కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు ఎస్సై భరోసా కల్పించారు.
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను
రెగ్యులరైజ్ చేయాలి
జాతీయ ఆరోగ్య మిషన్ తరఫున విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల సేవలను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రాత పరీక్షకు సంబంధం లేకుండా ప్రక్రియను చేపట్టాలి. తాము విధుల్లోకి చేరిన తర్వాత వచ్చిన మెయిల్ హెల్త్ అసిస్టెంట్లను రెగ్యూలరైజ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలను గ్రామీణ స్థాయిలో తూచ తప్పకుండా పాటిస్తూనే ఉన్నాం. సంబంధం లేకుండా సీనియార్టీ ప్రకారం చేస్తున్న విధులను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.
– జమునా రాణి, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల
సంఘం జిల్లా అధ్యక్షురాలు
48గంటల
నిరవధిక సమ్మెకు దిగిన ఉద్యోగులు
రాత పరీక్ష ఎత్తివేయాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment