‘తోడు’ వీడి.. నింగికేగి
సాక్షి, వరంగల్/దుగ్గొండి: సంచార జాతినుంచి యక్షగానంతో సిని తెరకు పరిచయమైన బలగం మొగిలయ్య ఇక లేరు.. ఆయన తంబూర మూగబోయింది.. కిడ్నీలు ఫెయిలై, గుండె సమస్య రావడం, కంటి చూపు కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలతో మూడేళ్లుగా బాధ పడుతున్న పస్తం మొగిలి అలియాస్ బలగం మొగిలయ్య (67) వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం ఆరోగ్యం విషమించింది. ఎంజీ ఎం ఆస్పత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు బ్యానర్‌పై దర్శకుడు యెల్డండి వేణు నిర్మించిన బలగం సినిమాలో చివరి ఘట్టంలో ‘తో డుగా మాతోడుండి.. నీడగా మాతో నిలిచి’ అనే పాట పాడి కోట్లాది మంది ప్రజల హృదయాలకు దగ్గరైన మొగిలయ్య ఓరుగల్లుకే బలగమయ్యారు. పలువురు కళాకారులు, గ్రామస్తులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఓరుగల్లుకే పేరు తెచ్చారు...
దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలి(67), కొమురమ్మ దంపతులు బేడ బుడిగ జంగాలు. శార్థకథ కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి పూర్వీకులది కమలాపూర్ మండలం అంబాల కేశవాపురం. మొగిలి తల్లి దండ్రులు పస్తం పెంటయ్య, ముత్తమ్మ ఉపాధి కోసం మల్లారెడ్డిపల్లి, సిద్ధాపురం గ్రామాల్లో కొన్నాళ్లు ఉండి 30 ఏళ్ల క్రితం దుగ్గొండికి వచ్చి స్థిరపడ్డారు. మొగిలి తన భార్యతో కలిసి సుదీర్ఘ గ్రామాల్లో వేలాది కథలు చెప్పి గుర్తింపు పొందారు. ఇలా కథలు చెబుతున్న క్రమంలో బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణుకు పస్తం మొగిలిని ఒగ్గుకథ కళాకారుడు కాయేతి బాలు పరిచయం చేశారు. అలా బలగం సినిమాలో మొగిలయ్యతో పాడించిన ‘తోడుగా మాతో ఉండి... నీడగా మాతో నడిచి’ అనే పాట ప్రజల గుండెలను హత్తుకుని కంటతడి పెట్టించింది. ఈ పాటతో మొగిలి, కొమురమ్మ దంపతులకు పేరు ప్రఖ్యాతలు రావడంతోపాటు వరంగల్ జిల్లా పేరు మార్మోగింది. ఇటీవల పొన్నం సత్తయ్య ఫౌండేషన్ అవార్డును మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉనికిచర్లలో ఇంటిస్థలాన్ని కేటాయించారు. పట్టా కాగితాలు అందుకునే తరుణంలోనే మొగిలయ్య కన్నుమూశారు.
దహన సంస్కారాల కోసం
ఆర్థిక సాయం..
మొగిలయ్య మృతి వార్త తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.50 వేలు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.50వేలు ఆర్థికసాయం పంపించారు. వారి ప్రతినిధులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, ఎల్కతుర్తి మండల నాయకుడు బొమ్మెనపల్లి అశోక్‌రెడ్డి.. మొగి లయ్య భార్య కొంరమ్మకు అందించారు. మొగి లయ్య మృతదేహాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మృతి జానపద కళకు తీరని లోటన్నారు. ప్రభుత్వం మొగిలయ్య కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ, నర్సంపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మాజీ మంత్రి దయాకర్‌రావు, బలగం సినిమా నటుడు రచ్చ రవి, పలువురు కళాకారులు సంతాపం ప్రకటించారు. సాయంత్రం పలువురు కవులు, కళా కారులు పాటలతో మొగిలయ్యకు నివాళులర్పించారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.
‘బలగం’ మొగిలయ్య ఇక లేరు
తోడుగా మాతో ఉండి
పాటతో పేరు ప్రఖ్యాతలు
కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం..
దుగ్గొండిలో అశ్రునయనాల మధ్య
అంత్యక్రియలు పూర్తి
పాటలతో నివాళులర్పించిన
కళాకారులు
Comments
Please login to add a commentAdd a comment