‘తునికాకు యూనిట్ల రద్దు దుర్మార్గం’
గోవిందరావుపేట: తునికాకు యూనిట్ల రద్దు దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండలంలోని పస్రాలో గల పార్టీ కార్యాలయంలో కొప్పుల రఘుపతి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 300 యూనిట్ల తునికాకు టెండర్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఆ ప్రమాదం జిల్లాకు ఉందని అందుకే తెలంగాణలో వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని కోరారు. తునికాకు గిరిజనులు, పేద ప్రజలకు ఒక పంట లాంటిదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల కోసం అడవిలో యురేనియం తవ్వకాల కోసం తునికాకు యూనిట్లు రద్దు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, రత్నం రాజేందర్, పొదిళ్ల చిట్టిబాబు, దావుద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment