గడువులోగా ఇళ్ల సర్వే పూర్తి చేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతిపై కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు చీమలపాటి మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల అర్హులను గుర్తించేందుకు మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. పీఎం ఆవాస్ యాప్‌లో సర్వేయర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తియాలని ఆదేశించారు. అంతకు ముందు ఉపాధిహామీ పథకం అమలు తీరుపై మండల ప్రత్యేకాధికారులు, ఏపీడీ, ఎంపీడీఓలు, ఎంపీఓలతో సమగ్రంగా సమీక్షించారు. నర్సరీలు, వనమహోత్సవం తదితర అంశాలపై అన్ని మండలాల ఎంపీడీఓలు, ఆయా మండలాల్లో సాధించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో సాధించిన లక్ష్యాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, ఎల్డీఎం, ఏపీడీ, మండల ప్రత్యేకధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, సీసీలు, ఎస్‌బీఎం, టీఏలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోవిందరావుపేట మండలం చల్వాయిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న జాబ్‌మేళా వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
రోబోటిక్స్ విద్యతో సృజనాత్మకత పెంపు
ములుగు రూరల్: రోబోటిక్స్ విద్య విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లాలో సోహం అకాడమి ఆధ్వర్యంలో రోబోటిక్స్ ఇన్ అకాడమిక్ వారు పలు పాఠశాలల్లో విద్యార్థులకు రోబోటిక్స్ విద్యపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌టీటీ డాటా సంస్థ సీఎస్‌ఆర్ మద్దతుతో 120 మంది శిక్షణ కర్తలు జిల్లాలోని 10పాఠశాలల్లో 1088 మంది విద్యార్థులకు రోబోటిక్స్‌పై శిక్షణ అందించారని తెలిపారు. ఈ శిక్షణలో విద్యార్థులు రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలు నేర్చుకున్నారని వివరించారు. విద్యార్థులు ఏడాది పొడవునా ఇన్నోవేషన్ చాలెంజ్‌లలో పాల్గొంటారని తెలిపారు. రోబోటిక్స్ విద్య ద్వారా సమస్యల పరిష్కారం, నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని జాకారం, ములుగు, ఇంచర్ల, బండారుపల్లి గురుకుల పాఠశాలలతో పాటు చల్వాయి, ములుగులోని కేజీబీవీల్లో, జవహర్‌నగర్, చల్వాయి, బండారుపల్లిలోని మోడల్ స్కూళ్లలో రోబోటిక్స్ విద్యపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు శిక్షణ తీసుకున్న విద్యార్థులకు రోబోటిక్స్ కిట్లు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, సైన్స్ అధికారి జయదేవ్, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment