సోలార్ ప్లాంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి
ఏటూరునాగారం: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోడు భూముల హక్కు పత్రాలను కలిగిన గిరిజన రైతులు సోలార్ ప్లాంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర బుధవారం అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష పవం ఉత్తమ్ మహాబియాన్ (పీఎం కుసుమ్) పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సహం కలిగిన గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పీఓ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల కౌలు రైతులకు ఆదాయం వస్తుందన్నారు. అర్హులైన రైతులు ఈనెల 19లోపు ఐటీడీఏ, డీడీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
20న జరిగే కేయూ
దూరవిద్య పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యకు సంబంధించి ఈనెల 20న జరగాల్సిన పీజీ ఫస్ట్ సెమిస్టర్(నాల్గవ పేపర్ ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జూవాలజీ, మ్యాథ్‌మెటిక్స్) పరీక్షలు ఈనెల 24వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆరోజు టీజీటెట్ పరీక్ష ఉన్నందున తేదీ మార్చినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మిగితా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కోటలో పర్యాటకుల సందడి
ఖిలా వరంగల్: సంక్రాంతి, కనుమ పండుగ నేపథ్యంలో బుధవారం కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటకు భారీగా సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. సనాతన్ ధర్మ కాలేజీ, న్యూఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర జిల్లాలతోపాటు నగర ప్రజలు కోటను సందర్శించారు. మధ్యకోట శిల్పాల ప్రాంగణం సందడిగా మారింది. శిల్ప సంపద, ఖుష్‌మహల్, ఏకశిల గుట్ట, రాతి మట్టికోట అందాలను తిలకించారు. కాకతీయుల విశిష్టత, నిర్మాణ శైలిని కోట గైడ్ రవియాదవ్ పర్యాటకులకు వివరించారు. ఆనంతరం టీజీ టీడీసీ ఆధ్వర్యాన నిర్వహించిన సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు.
కాసీంపల్లి వాసికి అవార్డు
భూపాలపల్లి రూరల్: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు పరిరక్షణకు కృషిచేస్తూ కవితలు, పాటలు, కథలు రాస్తున్న యువ రచయితకు అవార్డు దక్కింది. భూపాలపల్లి మున్సిపాలిటీ కాసీంపల్లికి చెందిన బేతు సునీల్ యాదవ్ జాతీయ యువ తేజం పురస్కారానికి ఎంపికై నట్లు శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ బుధవారం ప్రకటనలో తెలిపారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ వరల్డ్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే సాహితీ సంబురాల్లో సునీల్ యాదవ్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఇదిలా ఉండగా.. తను రాసిన పుస్తకాలు మట్టిచిప్ప, తునికాకు త్వరలో ప్రచురించనున్నట్లు సునీల్ యాదవ్ తెలిపారు.
ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ క్రికెట్ పురుషుల జట్టు
కేయూ క్యాంపస్: చైన్నెలోని మద్రాస్ యూనివర్సిటీలో ఈనెల 16 నుంచి నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌కు కేయూ క్రికెట్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య బుధవారం తెలిపారు. జట్టులో బి.విశాల్‌యాదవ్, బి.వరుణ్, జి.హరిప్రసాద్, షేక్ సమీర్‌పాషా(వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ హనుమకొండ), కె.నిఖిల్ (యూఏఎస్‌సీ హనుమకొండ), కె.రోహిత్‌రెడ్డి, మహ్మద్ ఇబ్రహిమ్(కిట్స్ వరంగల్), బి.కిరణ్ (యూసీపీఈ కేయూ వరంగల్), షేక్ అజహర్, బి.సంతోష్(ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ఖమ్మం), ఆర్.శ్రీచరణ్(జేఆర్‌బీ డిగ్రీకాలేజీ ఆదిలాబాద్), బి.సచిన్ (యూసీఈ కేయూ ఖమ్మం), ఆమ్‌గోత్ డివిన్(కేఎండీసీ ఖమ్మం), మహ్మద్‌పర్హాన్(మాస్టర్జీ డిగ్రీకాలేజీ హనుమకొండ) ఉన్నారు. వీరికి హనుమకొండలోని కేశవ డిగ్రీకాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎం.కుమారస్వామి కోచ్‌గా, హనుమకొండలోని గీతాంజలి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ మహ్మద్ మహమూద్‌అలీ మేనేజర్‌గా వ్యహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment