అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ములుగు: జిల్లాలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రేషన్ కార్డులు చేరేలా కార్యాచరణ చేపడుతున్నాం. ఈ విషయంలో ఎలాంటి అపోహలు నమ్మొద్దు’ అని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనుందని, వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా పంట వేసినా, వేయకపోయినా అందుతుందన్నారు. రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దని, రైతు భరోసా పథకానికి ఎలాంటి పరిమితులు లేవన్నారు.
ఎకరాకు రూ.12 వేలు
వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రూ.12 వేలు పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సైతం ఏడాదికి రూ.12 వేలు అందించనున్నట్లు.. ఒక్కో విడతకు రూ.6 వేల చొప్పున రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. 2023–24 సంవత్సరానికి ఉపాధి హామీ కింద పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈపథకం వర్తిస్తుందన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పని చేసిన కార్మికుల జాబితాను తీసుకుని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం.. పరిశీలిస్తూ భూమి లేని కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా సొంత భూమి ఉండి ఇళ్లు లేని కుటుంబాల జాబితాను సిద్ధం చేశామని తెలిపారు. జనవరి 16 నుంచి 20 వరకు గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హుల జాబితా గ్రామాల వారీగా సిద్ధం చేసిన తర్వాత ఏ గ్రామంలో ఎంత మంది అర్హులకు మొదటి విడత ఇల్లు అందించాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను, ఎంపీడీఓలను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని లేదా కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నంబర్ 180042 57109ను సంప్రదించాలని కోరారు.
26 నుంచి నాలుగు అమలు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దు
కలెక్టర్ టీఎస్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment