రైతు భరోసాకు నిరీక్షణ!
సబ్‌కమిటీ పేరుతో కాలయాపన..
వానాకాలం సీజన్‌లోనే పెట్టుబడిసాయం అందించి తీరుతామని, దానిపై రైతులతో సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ ఒక్క జిల్లాలో మాత్రమే రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇతర జిల్లాలో ఎక్కడా రైతుల అభిప్రాయాలను తీసుకున్న దాఖలాలు లేవు. సబ్‌కమిటీ నివేదిక వచ్చిన తరువాత అసెంబ్లీలో చర్చించి ప్రకటన చేస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ సబ్‌కమిటీ పేరుతో ప్రభుత్వం రైతుభరోసాను కాలయాన చేస్తుందన్న వాదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుభరోసా అందించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఫ వానాకాలం సీజన్‌లో అందని
పెట్టుబడి సాయం
ఫ యాసంగిలోనైనా ఇస్తారా లేదా అనే ఆందోళన
ఫ ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
ఫ జిల్లాలో 5.50లక్షల మంది రైతుల ఎదురుచూపు
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులవుతోంది. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయమైన రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా 10 వేల పెట్టుబడిసాయం అందించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్‌లో రూ.625 కోట్లను అందించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతుబంధును రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.7500 చొప్పున పెంచి అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.15 వేలు అందించి రైతులను ఆదుకుంటామని చెప్పింది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. రైతుభరోసాపై ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన వానాకాలంలో కూడా రైతులు పెట్టుబడిసాయం కోసం ఆశతో ఎదురుచూసినా సీజన్ ముగిసే వరకు కూడా అందలేదు. ఈ యాసంగిలోనైనా రెండు సీజన్లకు కలిసి ఒకేసారి పెట్టుబడిసాయం అందుతుందన్న ఆశతో రైతులు నిరీక్షిస్తున్నారు.
సాగు పనుల్లో రైతులు నిమగ్నం..
ప్రస్తుతం యాసంగి సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమైంది. రైతులు వరినార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాల దున్నకం, విత్తనాలు కొనుగోలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పంట పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా యాసంగిలోనైనా రైతుభరోసా డబ్బులు అందితే పెట్టుబడులకు ఇబ్బందులు తప్పుతాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎకరానికి రూ.5 వేలా.. రూ.7,500 అన్నదానితో పాటు ఎప్పుడు ఇస్తుందో కూడా చెప్పడం లేదు. అసలు రైతుభరోసాపై ఎక్కడా స్పష్టంగా ప్రకటించకపోవంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతుభరోసా డబ్బులు ఇవ్వాలి
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుభరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడుల ఇబ్బందులను తొలగించాలి. వానాకాలంలో కూడా పెట్టబడిసాయం ఇవ్వకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం రైతుల బాధలు అర్థం చేసుకోవాలి.
– చిమట భిక్షమయ్య,
గుండ్లపల్లి, నల్లగొండ మండలం
పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నాం
వానాకాలంలో రైతుభరోసా రాకపోవడంతో పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో కూడా రైతుభరోసాపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. రైతుభరోసా ఇస్తుందో లేదో విషయాన్ని ప్రకటించాలి.
– కట్టెబోయిన కొండల్‌యాదవ్, అన్నారం, త్రిపురారం మండలం
Comments
Please login to add a commentAdd a comment