నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక

Published Fri, Dec 20 2024 2:05 AM | Last Updated on Fri, Dec 20 2024 2:05 AM

నేడు

నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక

నల్లగొండ : నల్లగొండకు ఈ నెల 20న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 10.30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 వరకు నల్లగొండలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం 6.30కు హైదరాబాద్‌ బయల్దేరి వెళతారు.

పాలిటెక్నిక్‌లో ఐటీఐ విద్యార్థులకు ప్రవేశాలు

నల్లగొండ : ఐటీఐ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌ రెండవ సంవత్సరం డిప్లొమా కోర్సు (బ్రిడ్జి కోర్సు)లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని నల్లగొండ ప్రభుత్వ బాలికల న్యూ ఐటీఐ ప్రిన్సిపాల్‌ జంజిరాల వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లు ఐటీఐ (ఇంజనీరింగ్‌ (ఎన్‌సీవీటీ) కోర్సు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఈ నెల 18 నుంచి జనవరి 30వ తేదీ వరకు నల్లగొండ ప్రభుత్వ బాలికల న్యూ ఐటీఐ కాలేజీలో సంప్రదించాలని పేర్కొన్నారు. అర్హత ఇతర వివరాలకు 8919234137 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

శ్రీనిధి రుణాలు రికవరీ చేయాలి

గుర్రంపోడు : శ్రీనిధి రుణాలు వంద శాతం రికవరీ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడులో సెర్ప్‌ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు లింకేజీలో వందశాతం రుణాల మంజూరు చేయాలని సూచించారు. ఇందిరా మహిళాశక్తి కింద పాడిగేదెలు ఇప్పించాలని, సంఘాల్లో సభ్యులందరికి రుణబీమా, ప్రమాద బీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీఎం వరికుప్పల యాదయ్య పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ : ఇందిరమ్మ మహిళా శక్తి పథకానికి మైనార్టీ మహిళలు (ముస్లిం, సిక్కులు, బౌద్దులు, జైన్స్‌, పార్సిస్‌ మతాల వారు) ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ, నిరుపేద, విడాకులు తీసుకున్న, వితంతు, అనాథ, ఒంటరి మహిళలలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో tgobmm s.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు తెల్లరేషన్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం, వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తెలిపే ధ్రువీకరణపత్రం, ఓటరు ఐడీ, ఆధార్‌కార్డు, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వ గుర్తింపు పొండిన ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా పొందిన టైలరింగ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని సూచించారు. ఒక కుటుంబానికి/ఇంటికి ఒక కుట్టు మిషన్‌ మాత్రమే ఇస్తారని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు కనీస విద్యార్హత 5వ తరగతి ఉండాలని తెలిపారు.

2,38,529 టన్నుల ధాన్యం కొనుగోలు

గుర్రంపోడు : జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 2,38,529 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం గుర్రంపోడు మండలంలోని చామలేడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. 1,92,969 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం, 45,560 మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ధాన్యం ఇక్కడి కేంద్రాలకు తరలించకుండా గట్టి నిఘా ఉంచామన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన..

మండలంలోని జూనూతుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను పరిశీలించారు. వివరాలను యాప్‌లో నమోదు పక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి గ్రామ కార్యదర్శికి తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట జిల్లా మేనేజర్‌ హరీష్‌, ఎంపీడీఓ మంజుల, ఆర్‌ఐ రావుల సైదులుగౌడ్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక1
1/1

నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement