30, 31 తేదీల్లో సైన్స్ ఫెయిర్
నల్లగొండ: నల్లగొండ పట్టణ పరిధిలోని డాన్‌బాస్కో ఉన్నత పాఠశాలలో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, కమ్యూనికేషన్, సహజ వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మేథమేటికల్ మోడల్స్, కంప్యూటేషనల్ థింకింగ్ వ్యర్థాల నిర్వహణపై ఉపఅంశాలల ఆధారంగా విద్యార్థులతో ప్రాజెక్టులను తయారు చేయించి ఉపాధ్యాయులు ప్రదర్శించాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి తప్పనిసరిగా 2 ప్రాజెక్టులు తీసుకురావాలని ఆదేశించారు. జిల్లాలో గతంలో ఎంపికై న 113 ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించాలని కోరారు.
డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు అధికారి బాధ్యతల స్వీకరణ
నల్లగొండ: డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు అధికారిగా నెల్లూరు వాణి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉప్పల్ ఆర్‌టీఓగా పనిచేస్తున్న వాణి పదోన్నతిపై నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు అధికారిగా బదిలీపై వచ్చారు. విధుల్లో చేరిన ఆమెకు పలువురు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి
చిట్యాల: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణ డీపీఆర్‌ను విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు, కాల్వలు, ఆసీఫ్‌నహర్ కాల్వల తూములు, షెట్టర్‌లకు మరమ్మతులతోపాటు ఎస్‌ఎల్‌బీసీ కాల్వలకు లైనింగ్ పనులు చేపట్టాలన్నారు. ప్రజా సమస్యలను తెలిపేందుకుగాను ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్మిక సంఘాల నాయకులను అరెస్ట్‌లు చేయడం తగదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, కత్తుల లింగస్వామి, పామనగుళ్ల అచ్చాలు, అర్రూరి శ్రీను, లడే రాములు, దేశబోయిన సరస్వతి, కందగట్ల గణేష్, కల్లూరి కుమారస్వామి, ఐతరాజు నర్సింహ, బొబ్బలి సుధాకర్‌రెడ్డి, మెట్టు నర్సింహ, ఐతరాజు యాదయ్య, వెంకన్న, నరేష్, రాములు పాల్గొన్నారు.
నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టి.. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment