నంద్యాల: జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యాటక మండలి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంతజూటూరు నుంచి ఓంకారం, వైఎస్సార్ స్మృతివనం, నంద్యాల జిల్లాను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవుకు బోటింగ్, రెస్టారెంట్ నిర్వహణకు టెండర్లు పిలిచి ఖరారు చేయాలన్నారు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు పాత బకాయిల వసూళ్లకు చివరిసారిగా నోటీసులు ఇచ్చి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల బోట్లలో ప్రయాణానికి సంబంధించి తొమ్మిది రకాల అనుమతులు తీసుకోవాలన్నారు. సిద్ధేశ్వరం నుంచి సోమశిల సింగోటం జాతరకు భక్తులు బోట్లలో వెళ్తున్నారని, అనుమతులు లేని వాటిలో ప్రయాణం చేయకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి సత్యనారాయణమూర్తి, ఏపీటీడీసీ డీవీఎం చంద్రమౌళి, డీఈ కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, జిల్లా ఫారెస్ట్ అధికారి నాగమునేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment