రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో చికిత్స కోసం వచ్చే రోగుల నుంచి ఏఎన్‌ఎం, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది డబ్బు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం ఆయన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పి.సింధు సుబ్రహ్మణ్యంతో కలిసి ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా రూ.3 కోట్ల గ్రాంట్ మంజూరైందని, ఇందులో హాస్పిటల్‌కు సంబంధించిన సివిల్ వర్క్స్, డ్రైనేజీ మరమ్మతులు, ఎలక్ట్రికల్ వర్క్ ద్వారా ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. గైనిక్ విభాగంలో బాత్‌రూమ్‌ల మరమ్మతులు, ఫార్మసీ విభాగంలో బాత్‌రూమ్‌ల కోసం అంచనా ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న డ్రైనేజీ మరమ్మతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామయ్య, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ హేమనళిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాలనాగాంజన్, డాక్టర్ కిరణ్‌కుమార్, న్యూ డయాగ్నోస్టిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ ప్రశాంత్, ఆసుపత్రి ఏడీ రమేష్‌బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2 విమలమ్మ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment