‘స్మార్ట్’ దోపిడీ!
నంద్యాల(అర్బన్): కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడున్న మీటర్ల ద్వారా వస్తున్న కరెంటు బిల్లులే షాక్ కొట్టే విధంగా ఉన్నాయని విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే ట్రూ అప్ చార్జీల పేరుతో కరెంటు బిల్లులు భారీగా పెంచి సర్కారు దోచుకుంటోంది. జిల్లాలోని 10.25లక్షల విద్యుత్ మీటర్లు ఉన్నాయి. నంద్యాల, ఆత్మకూరు, డోన్ డివిజన్లలోని కనెక్షన్లను డొమెస్టిక్, కమర్షియల్ పరిశ్రమలు, ప్రభుత్వ, వ్యవసాయ, ఆలయాలు, పాఠశాలలు, తాత్కాలిక విభాగాలు కలిపి మొత్తం 8 కేటగిరీలుగా విభజించారు. వాటిలో అత్యధికంగా నివాసాలకు వాడుకునే డొమెస్టిక్ కేటగిరి కింద దాదాపు 6.56 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తర్వాతి స్థానంలో సుమారు 1.10 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
మొత్తం 8 కేటగిరీలుగా ఉన్న విద్యుత్ మీటర్లలో ప్రాధాన్యతా క్రమంలో స్మార్ట్ మీటర్లు అమర్చమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతమున్న ఇన్‌ప్రారెడ్ రేడియేషన్ (ఐఆర్)పోర్టు మీటర్ల స్థానంలో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత జిల్లాలో కమర్షియల్ కేటగిరీలలో ఉన్న కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. తర్వాత డొమెస్టిక్, వ్యవసాయం అంటూ ప్రాధాన్యతా రంగాల వారీగా బిగించనున్నారు.ఈ ప్రక్రియ అంతా రానున్న ఐదారు నెలల్లోనే పూర్తి కానుంది.
ఎన్నో అనుమానాలు...
గతంలో ఉన్న పాత మీటర్ల ద్వారా నెలంతా విద్యుత్ వాడుకున్న తర్వాత కరెంటు బిల్లులు వస్తే ఇంట్లో డబ్బులు ఉండే వెసులుబాటును బట్టి బిల్లు చెల్లించే అవకాశం ఉండేది. ఒక వేళ కరెంటు మీటర్లకు రిపేరు వచ్చినా స్థానికంగా ఉన్న వారిని పిలిపించుకుని వెంటనే చేయించుకోవడం ద్వారా గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారమయ్యేది. కానీ, స్మార్ట్ మీటర్లు బిగిస్తే నెల మొత్తం మీద ఎంత కరెంటు వాడుకుంటామో తెలియకుండానే ప్రీపెయిడ్ రీచార్జి పేరుతో వినియోగదారుల నుంచి ముందుగానే డబ్బు లాగేసుకునే కుట్ర జరుగుతోంది. ఒక వేళ ముందుగానే ప్రీపెయిడ్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే కేటాయించిన యూనిట్లు మొత్తం వాడుకోకపోతే ఆ తర్వాత నెలకు వాడుకునే వెసులుబాటు ఉంటుందా..? లేక మధ్యలోనే రీచార్జ్ అయిపోతే మళ్లీ చేయడం ఎలా..? ఆ సమయంలో చేతిలో డబ్బు అందుబాటులో లేకపోతే ఎలా..? చీకట్లోనే మగ్గిపోవాల్సిందేనా..? అంటూ వినియోగదారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటూ పోవడాన్ని వినియోగదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఆపేందుకు టూ ఇన్ వన్ మీటర్లుగా స్మార్ట్ మీటర్లు పనిచేస్తాయంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు స్మార్ట్‌మీటర్లు బిగిస్తే పగలగొట్టండంటూ పిలుపునిచ్చిన కూటమి నాయకులే ఇప్పుడు వాటిని తీసుకొస్తుండటంతో ఎన్నికల ముందు ఒకలాగా అధికారంలోకి వచ్చాక మరోరకంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
డబ్బు వసూలు సరి కాదు
ఇప్పటి వరకు కరెంటు ఎంత వాడుకున్నారో అంతకే నెల రోజుల తర్వాత బిల్లు వస్తే గడువు తేదీలోగా చెల్లించే అవకాశం ఉంది. కానీ, స్మార్ట్ మీటర్ల వలన ఎంత వాడుకుంటారో తెలియకుండానే ముందుగానే ప్రీపెయిడ్ ద్వారా వినియోగదారుల నుంచి డబ్బు గుంజుకుంటారు. దీనివలన వినియోగదారులపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది.
– ఎన్.రవి, ఎన్‌జీఓ కాలనీ, నంద్యాల
మీటర్లు పగలగొట్టాలన్నారు
గత ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం ఓటర్లను ఆకర్షించేందుకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చంద్రబాబు పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆయన స్మార్ట్ మీటర్లను త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారంలోకి రాకముందు ఒక రకంగా, వచ్చిన తర్వాత మరోరకంగా చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది.
–రఫీ, పీడీఎస్‌యూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment