కనులపండువగా అయ్యప్ప పడిపూజ
నారాయణపేట టౌన్: నారాయణపేట పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. శుక్రవారం నారాయణపేట శివారులోని శబరిపీఠం అయ్యప్ప సన్నిధానం ఆధ్వర్యంలో 33వ మహా పడిపూజ నిర్వహించారు. ముందుగా సుభాష్‌రోడ్డులోని బారంభావి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశ ఊరేగింపు ప్రధానదారి గుండా అంగరంగ వైభవంగా సాగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, మంగళవాయిద్యాల మధ్య శోభాయత్ర ముందుకు సాగింది. అయ్యప్ప మాలధారులు భక్తిపారవశ్యంతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తిగీతాలు, భజనలు, నృత్యాలు చేస్తూ స్వామిని కొలిచారు. సరాఫ్‌బజార్‌లోని బసవన్న దేవాలయం వద్దకు చేరుకోగా అక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వామికి శాస్త్రోక్తంగా చందనం, లేపనాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం 18 ఏళ్లుగా మాల ధరించిన పలువురు గురుస్వాములను సన్మానించారు. అనంతరం పడిపూజకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నవితరణ చేశారు. శబరిపీఠం ఆవరణలో గణపతి ఆలయం నిర్మాణానికి భీష్మ పౌండేషన్ వ్యవస్థాపకులు రాజ్ కుమార్‌రెడ్డి రూ.5లక్షల విరాళం అందించారు. కార్యక్రమంలో గురుస్వామి జంగిటి వెంకటేష్, కాకర్ల భీమయ్య, రవి, కిషోర్‌గౌడ్, ఉమాపతి గౌడ్,సమర సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment