తెల్ల కందులు క్వింటా రూ.8,721
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం తెల్ల కందులు గరిష్టంగా రూ.8,721, కనిష్టంగా రూ.6 వేలు ధర పలికాయి. అలాగే, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,706, కనిష్టంగా రూ.3 వేలు, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,493, కనిష్టంగా రూ.1,830 ధర పలికాయి.
రేపు రౌండ్ టేబుల్ సమావేశం
పాలమూరు: డిండి ఎత్తిపోతల పేరుతో పాలమూరు–రంగారెడ్డి పథకం నీరు తరలింపుపై ప్రతిపాదన ఉపసంహరణ, 14 నియోజకవర్గాలకు జలవనరుల కల్పన, కృష్ణానది నీటిలో తెలంగాణ రాష్ట్ర వాటా సాధనపై ఆదివారం జిల్లాకేంద్రంలోని టీఎన్‌జీఓ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్ హాజరవుతారని వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, పౌరులు అధికంగా హాజరుకావాలని కోరారు.
పంట రుణాల కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
● 2025–26 ఆర్థిక సంవత్సరానికిప్రతిపాదనలు సిద్ధం
● డీసీసీబీ ఆడిటోరియంలో డీఎల్‌టీసీ సమావేశం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో పంట రుణాల కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను డీసీసీబీ పాలకవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శుక్రవారం స్థానిక డీసీసీబీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్‌టీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్, డీసీసీబీ సీఈఓ డి.పురుషోత్తంరావు పంటల వారీగా ప్రస్తుత ఏడాది (2024–25) కి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణలోకి తీసుకున్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో చర్చించి ఏయే పంటలకు ఎన్ని రుణాలు ఇవ్వాలనే దానిపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపిస్తామన్నారు. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే ఆయా బ్రాంచీ అధికారులకు పూర్తి సమాచారం తెలియజేస్తామన్నారు. సమావేశంలో నాబార్డు డీడీఎంలు మనోహర్‌రెడ్డి, షణ్ముఖచారి, డీఏఓ వెంకటేష్‌తో పాటు బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల:జిల్లా మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయంలో గణితం, హిందీ విభాగాల్లో, ఆఫీసు సబార్టినేట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు, అదేవిధంగా జిల్లా మైనార్టీ జూనియర్ కాలేజీలో స్టాఫ్‌నర్స్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్వార్డ్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. దరఖాస్తులు ఈనెల 7వ తేదీలోపు జిల్లా మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలని, గణితం సబ్జెక్టుకు ఎమ్మెస్సీ బ్యాథ్స్, బీ.ఈడీ, హిందీ హెచ్‌పీటీ, బీఈడీ విత్ పీజీ హిందీ అర్హత ఉండాలని, స్టాఫ్‌నర్స్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ అర్హత, సబార్డినేట్ పోస్టుకు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారులు జిల్లా వాస్తవ్యులు అయి ఉండాలని, పూర్తి వివకాలకు సెల్ నం.9441780107, 746603995 లను సంప్రదించాలని తెలిపారు.
యువతకు ఉపాధిరంగాల్లో ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ టీవీ, కెమెరా ఇన్‌స్టలేషన్, సర్వీసింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని, ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజనం సౌకర్యం, యూనిఫాం, టూల్ కిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం 95424 30607, 99633 69361 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment