నారాయణపేట పట్టణంలో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ (ఫైల్)
ఇందిరమ్మ ఇళ్ల సర్వే 93 శాతం పూర్తి
రాష్ట్రంలో 6వ స్థానంలో జిల్లా
క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న కలెక్టర్
11 మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కసరత్తు
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆఖరు దశకు చేరుకుంది. జిల్లాలో ఇప్పటివరకు 93 శాతం సర్వే పూర్తయ్యింది. జిల్లాలోని 11 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజాపాలన కార్యక్రమంలో 1,48,790 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో అర్హులను గుర్తించేందుకు 577 మందితో సర్వే చేపట్టారు. గత వారం రోజుల కింద జిల్లా వ్యాప్తంగా 48 శాతం సర్వే పూర్తి కాగా.. రాష్ట్రంలో 27వ స్థానంలో ఉండడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతిరోజు సర్వే నివేదికలపై పరిశీలిస్తూ.. అధికారులు మరింత వేగవంతం చేయాలని సూచిస్తు వచ్చారు. ఎట్టకేలకు జిల్లాలో 1,38,389 దరఖాస్తులను సంబంధించిన సర్వే చేయడంతో 93 శాతం పూర్తి కావడంతో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. ఇదిలాఉండగా, ఇళ్ల సర్వే డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాల్సి ఉండగా గ్రామాల్లో, తండాలు, పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో సర్వర్ సమస్య నెలకొంది. దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేసేందుకు యాప్ ఓపెన్ కాకపోవడంతో ప్రభుత్వం వారం రోజుల పాటు గడువు పొడగించడంతో గత నాలుగు రోజులు సర్వే ఊపందుకుంది. దరఖాస్తుదారుల్లో కొందరు బతుకుదెరువు కోసం వలస వెళ్లడం, సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో సర్వేకు వెళ్లిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక ప్రాంతంలో అద్దెకు ఉన్నవారు ఇతర ప్రాంతానికి మారడం, వారిని సంప్రదించడానికి దరఖాస్తులో వారు నమోదు చేసిన సెల్ నంబర్ ఫోన్ చేసిన స్పందించకపోవడం వంటి వాటితో మిగతా 7 శాతంలో ఇలాంటివే కనిపిస్తున్నాయి. అయినా అధికారులు వంద శాతం సర్వేను పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నారు.
● నిబంధనల మేరకు..
జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే దాదాపు 93 శాతం పూర్తి అయింది. గడువు పెంపుపై ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తాం. అర్హులైన వారందరికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయి.
– జి.శంకర్, హౌసింగ్ పీడీ, నారాయణపేట
మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కసరత్తు
జిల్లాలోని 11 మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు హౌసింగ్ పీడీ శంకరయ్య సూచనలతో అధికారులు ఎంపీడీఓలు సూచించే ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రెండు, మూడు మోడల్స్ కట్టి ఆ మాదిరిగానే ఇళ్లు నిర్మించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. 400 స్క్యార్ మీటర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉండి తీరాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు నిర్మించుకుంటే రూ.5లక్షల సరిపోతాయని చెబుతున్నారు.
త్వరలో లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే 93 శాతం పూర్తికావడంతో నివేదికలను తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మున్సిపాలిటిల్లో వార్డులు, గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సర్వే చేసిన వివరాలను మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామాల్లో ఎంపీడీఓలు 5 శాతం దరఖాస్తులను క్రాస్ చెక్ చేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా కలెక్టరేకు పంపించి పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రికి అందజేయనున్నారు. ఇన్‌చార్జి మంత్రి పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల ఫైనల్ జాబితా వస్తుంది. అనంతరం ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే డబ్బులను విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment