గంగనీళ్ల జాతరకు పోటెత్తిన భక్తజనం
గోదావరిలో అమ్మవారి ఆభరణాల శుద్ధి
దిలావర్‌పూర్ నుంచి సారంగాపూర్‌కు పాదయాత్ర
అమ్మవారి నగలకు అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి అలంకరణ
సారంగపూర్/దిలావర్‌పూర్: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామ గోదావరి పరీవాహక ప్రాంతం ఆదివారం తెల్లవారు జామున అశేష భక్తజనసందోహంతో పులకించింది. జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం గల అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాల ఊరేగింపు శోభాయాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి దిలావర్‌పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్‌పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేర్చారు. అమ్మవారి ఆభరణాల వెంట తరలివచ్చిన భక్తులు శనివారం రాత్రంతా పోచమ్మ ఆలయ పరిసరాల్లో అమ్మ వారి నామస్మరణ చేస్తూ జాగరణలో పాల్గొన్నారు. గంగానీకు శరణమే...ఘనమైన పూజలే... ఉయ్యాలో ఉయ్యాలో... ఊరూవాడ జంపాలో... పోచమ్మ తల్లీ.. సల్లంగ చూడమ్మో.. అంటూ అమ్మ వారి ఆభరణాలను ఆదివారం తెల్లవారు జామున గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లారు. అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారి నగలతో అడెల్లి దేవస్థానానికి తిరుగుపయనమయ్యారు. భక్తులు గోదావరి జలాలను గడముంతల్లో తీసుకుని అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. మండలంలోని కంజర్, బన్సపల్లి, దిలావర్‌పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో శోభా యాత్రకు ఘనస్వాగతం పలికారు. ది లావర్‌పూర్ గ్రామానికి చేరుకోగానే గ్రా మస్తులు జాలుక దండ(భారీ పూలతో రణం)తో స్వాగతం పలికారు. పోతురాజులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి యాటపిల్లలను (గొర్రె పొట్టేళ్లు)బహూకరించారు. శివసత్తుల పూనకాల మధ్య శోభాయాత్ర ముందుకుసాగింది. దారిపొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ, టెంకాయలు కొడుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ముగిసిన జాతర
భక్తులకు కొంగుబంగారంగా...కోరిన కోర్కెలు తీర్చే అనురాగవల్లిగా.... జిల్లా ప్రజల ఇలవేల్పుగా పేరొందిన అడెల్లి మహాపోచమ్మతల్లి గంగనీళ్లజాత ర ఆదివారం ముగిసింది. శనివారం రాత్రి నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలనుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్‌మాల్, నాందేడ్, చంద్రాపూర్ జిల్లాల నుంచి, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలనుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కోనేరులో స్నానం ఆచరించి దర్శనానికి క్యూకట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన, గంగానది జలాలతో ఆలయశుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకం, అనంతరం పవిత్రోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు.
గ్రామ గ్రామాన మంగళ హారతులు
దిలావర్‌పూర్ మండలంలోని సాంగ్వి గ్రామం నుంచి అమ్మవారి నగలు ఊరేగింపుగా తీసుకువస్తుండగా ఆయా గ్రామాల్లో భక్తులు, గంగపుత్రులు తమ వలలతో గొడుగుపట్టి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. గ్రామ పొలిమేరల వరకు సాగనంపారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
పోలీసు బందోబస్తు...
నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, రూరల్ సీఐ రామకృష్ణ, సారంగపూర్ ఎస్సై సల్ల శ్రీకాంత్, దిలావర్‌పూర్ ఎస్సై సందీప్‌తో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా కొద్ది దూరంలోనే వాహనాలు నిలిపి వేయడంతో భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో రమేశ్, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు.
భారీ ఏర్పాట్లు...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. అడెల్లి ఆలయ ఇన్‌చార్జి ఈవో రమేశ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సారంగపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వేదవ్యాస్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment