సర్దుబాటు..
● కేజీబీవీలకు మహిళా ఉపాధ్యాయులు ● ‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం నిర్ణయం ● మా టీచర్లు మాకే రావాలంటున్న విద్యార్థులు
లక్ష్మణచాంద: జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలు, కళాశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పాఠశాలలకు హాజరు కావడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 కేజీబీవీలు, కళాశాలల విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళా ఉపాధ్యాయులను కేజీబీవీలకు కేటాయించాలని ఆదేశించింది. దీంతో డీఈవో రామారావు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను కేజీబీవీల్లో సర్దుబాటు చేశారు. ఇందులో భాగంగా ఒక్కో కేజీబీవీలకు 6 నుంచి 12 మంది మహిళా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.
విధుల్లోకి మహిళా ఉపాధ్యాయులు...
ప్రభుత్వం సర్దుబాటు చేసిన మహిళా ఉపాధ్యాయులు శనివారం తమకు కేటాయించిన కేజీబీవీలకు వెళ్లి విధులు నిర్వహించారు. రోజుకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున మహిళా ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యేలా ఆయా మండలాల ఎంఈవోలు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.
రాత్రి మహిళా కానిస్టేబుళ్లు..
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాత్రివేళ విద్యార్థుల రక్షణ కోసం ఓ కానిస్టేబుల్‌కు విధులు కేటాయిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈవోలు తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
కేజీబీవీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 18 కేజీబీవీలకు ఆయా మండల పరిధిలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందుబాటులో మహిళా ఉపాధ్యాయులను 6 నుంచి 12 మందిని కేటాయించాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– రామారావు, డీఈవో, నిర్మల్
వంటకు ఇబ్బంది....
కేజీబీవీలలోని విద్యార్థులకు వంట చేయడం ఇబ్బందిగా మారింది. ఇందులో పనిచేస్తున్న వంట సిబ్బంది కూడా సమ్మె బాట పట్టడంతో విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం కష్టంగా మారిందని పలు మండలాలకు చెందిన ఎంఈవోలు అంటున్నారు. ఆయా మండలాల ఎంఈవోలు తమ క్లస్టర్ల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట చేసే సిబ్బందిలో కొంత మందిని బతిమాలి కేజీవీబీలకు తరలించి వంట చేయిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంటర్ విద్యార్థు లే వంట పాత్రలు శుభ్రం చేయడంతోపాటు వంట కూడా చేస్తున్నట్లు తెలిసింది.
మా టీచర్లు మాకే కావాలి...
తమకు ఇన్ని రోజులు విద్యను భోదించిన టీచర్లే కావాలని, కొత్త ఉపాధ్యాయులు వద్దని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులతో కనీసం మాట్లాడలేదని మహిళా ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కొందరు భోజనం చేయమని మారాం చేశారు. దీంతో విద్యార్థులను బుజ్జగించి చివరకు తినేలాగా చేస్తున్నామని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment