‘ఏకసభ్య కమిషన్’కు వినతుల వెల్లువ
● భారీగా తరలివచ్చి.. అర్జీలు అందజేసి ● రాష్ట్రంలోనే అత్యధికంగా వెయ్యికిపైగా దరఖాస్తులు ● ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా అభిప్రాయాలు వెల్లడి ● మాల, మాదిగల పోటాపోటీ నినాదాలతో ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత
కై లాస్‌నగర్: ఎస్సీ వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం చేసేందుకు గాను రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్‌తో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ శుక్రవారం ఆదిలాబాద్‌లో బహిరంగ విచారణ చేపట్టింది. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ నిర్వహించింది. నాలుగు జిల్లాల నుంచి మాల, మాదిగ ఉపకులాలకు చెందిన సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కుల సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా జాతరను తలపించింది. చైర్మన్‌కు వినతిపత్రాలు అందజేసిన ఆయా వర్గాల వారు ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
వెయ్యికి పైగా దరఖాస్తులు
ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు వర్గీకరణ కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరిస్తారని అధికారులు తొలుత ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి మాల, మాదిగ ఉపకులాలకు చెందిన వారు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలో నిల్చొని తమ వినతులను కమిషన్‌కు అందజేశారు. మూడున్నర గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. చైర్మన్ షమీమ్ అక్తర్, దళిత అభివృద్ధి శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామాలాదేవి, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా, ఆర్డీవో వినోద్‌కుమార్‌తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అత్యధికంగా వెయ్యికిపైగా అందినట్లు అధికారులు వెల్లడించారు. మాల, మాదిగ, బేడ బుడగజంగం, మిత్తల్‌అయ్యవార్, మహార్, మాంగ్, చిందు, కొండదాస్ వంటి 11కులాలకు చెందిన వారు హాజరై అర్జీలు అందజేశారు. తమ కులాల స్థితిగతులు, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉ ద్యోగ పరంగా వెనుకబాటును కమిషన్‌కు వివరించారు. మాల, దాని ఉపకులాల వారు వర్గీకరణ చేయవద్దంటూ విజ్ఞప్తి చేయగా.. మాదిగ, దాని ఉపకులాల వారు వర్గీకరణ జరిగేలా చూడాలని నివేదించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీఎస్సీడీవోలు సునీతకుమారి, రాజేశ్వర్‌గౌడ్, రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు మనోహర్, శంకర్, దుర్గాప్రసాద్, సజీవన్ తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత
ఎమ్మార్పీఎస్ నాయకులు డప్పుచప్పుళ్ల నడుమ చైర్మన్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ బయటకు వెళ్తుండటంతో వారు నిరసన వ్యక్తం చేశారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారంటూ కార్యాలయంలోని ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో మాల కులస్తులు కూడా అధికసంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రతిగా నినాదాలు చేశా రు. ఇలా మాల, మాదిగల అనుకూల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీన్ని గుర్తించిన పోలీసులు డీఎస్పీ జీవన్ రెడ్డికి సమాచారం అందించడంతో సాయుధ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ప్రభుత్వానికి నివేదిస్తాం
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. అందులో భాగంగా మెదక్ జిల్లాతో ప్రారంభించి ఇప్పటి వరకు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాం. ఎస్సీ ఉపకులాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాం. చివరగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దళిత, దాని ఉపకులాల నుంచి దరఖాస్తులను స్వీకరించాం. వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా జిల్లాలో విశేష స్పందన కనిపించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8వేల దరఖాస్తులు అందాయి. ప్రతీ దరఖాస్తును పరిశీలించి కులాల వారీగా స్థితిగతులను అధ్యయనం చేస్తున్నాం. దీనిపై ప్రభుత్వానికి త్వరలోనే సమగ్ర నివేదిక అందజేస్తాం.
– షమీమ్ అక్తర్, కమిషన్ చైర్మన్
సీతాగోందిలో అభిప్రాయ సేకరణ
గుడిహత్నూర్: ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ శుక్రవారం మండలంలోని సీతాగోంది గ్రామంలో పర్యటించారు. పలు మహార్ కుటుంబ పెద్దలతో ముచ్చటించారు. ప్రధాన వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, మండల ప్రత్యేకాధికారి సునీత, తహశీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో అబ్దుల్‌హై తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment