అలంకార ప్రాయంగా ‘ఎత్తిపోతలు’
నిజామాబాద్ రూరల్: రూ. కోట్లు నిధులు వెచ్చించి రైతుల పంటలకు సకాలంలో సాగునీరు అందించేలా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు అలంకార ప్రాయంగా ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి మరమ్మతులతో పథకాలు నిరుపయోగంగా మారాయి. కొండూర్ శివారులో రెండు పంటలకు పుష్కలంగా నీరందించేంచేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం రైతులకు అందని ద్రాక్షలా మారింది. రూ. 1.95 కోట్లు ఖర్చు చేసి ఫులాంగ్ వాగు కొండూర్ శివారులోని వాగుపై ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. 2018లో రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్(ఆర్‌ఐడీఎఫ్) నిధులతో దీనిని నిర్మించారు. నిర్వహణ లోపం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోక ప్రారంభించిన రెండేళ్లకే మూత పడింది. దీంతో రైతులు, ఖరీఫ్, రబీ సీజన్‌లో పంటలకు నీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు.
చోరీకి గురైన యంత్రాలు
కొండూర్ శివారులో ఉన్న ఎత్తిపోతల పథకం పూర్తి గా పాడవడంతో అందులో ఉన్న మూడు మోటర్ల నుంచి రెండు మోటర్లను గుర్తు తెలియని దుండగు లు దొంగిలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసై అధికారుల పర్యవేక్షణ లేమితో ఎత్తిపోతల పథకం కాస్తా మూలన పడింది.
ప్రజాధనం దుర్వినియోగం
కొండూర్ ఎత్తిపోతల పథకంపై పూర్తిగా అధికారుల నిర్లక్షంతో మూలన పడిందని రూరల్ మండలంలోని తిర్మన్‌పల్లి, కొండూర్, అశోక్ ఫారం గ్రామస్తులు పేర్కొంటున్నారు. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన లిఫ్ట్‌లు, పంపులు దొంగతనానికి గురి కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీని పై ప్రజాప్రతినిధులు స్పందిచాలని రైతులు కోరుతున్నారు.
కొండూర్ ఎత్తిపోతల మోటర్ల గది
410 ఎకరాల ఆయకట్టు
రూ. కోట్ల నిధులతో చేపట్టిన పథకాలు నిరుపయోగం
మరమ్మతులు చేయించాలంటున్న రైతులు
పట్టించుకోని అధికారులు
ఎత్తిపోతలను పున:ప్రారంభించాలి
రూ. కోట్లు ఖర్చు చేసి కొండూర్‌లో నిర్మించిన ఎత్తిపోతల పథకం పాడైపోయింది. ప్రస్తుతం నిజాంసాగర్ కెనాల్ వచ్చేంత వరకు ఎదురు చుడాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొండూర్ ఎత్తిపోతలను పున:ప్రారంభించి రైతుల సమస్యలను పరిష్కరించాలి.
– సుదర్శన్, రైతు, తిర్మన్‌పల్లి
కొండూర్ ఎత్తిపోతల ద్వారా మండలంలోని తిర్మన్‌పల్లి, కొండూర్, అశోక్‌ఫారం గ్రామాల్లో 410 ఎకరాలకు నీరు అందుతుంది. ప్రభుత్వ పర్యవేక్షణ అనంతరం గ్రామ కమిటీకి లిఫ్ట్ బాధ్యతలు అప్పగించారు. కానీ వాటి నిర్వహణకు వారు సరిగా పట్టించుకోలేదు. చెక్‌డ్యాంల నిర్మాణం, నిజాంసాగర్ నీరు సంబంధిత గ్రామాలకు రావడంతో లిఫ్ట్‌ను పట్టించుకోలేదు. దీంతో పాటు లిఫ్ట్‌ను గ్రామస్తులు విస్మరించారు. అధికారులు లిఫ్ట్‌కు మరమ్మతులు చేయించకుండా అలాగే వదిలేయడంతో ఎత్తిపోతల పథకం కింద ఉన్న కొండూర్‌లో ఉన్న రెండు యంత్రాలు మొరాయించి మూలన పడ్దాయి. ప్రస్తుతం నిజాంసాగర్ కెనాల్‌పై ఆధారపడిన రైతులు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా మరిచిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment