క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట
వైస్ చాన్స్‌లర్ టి యాదగిరి రావు
మోపాల్(తెయూ): రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెయూ వైస్ చాన్స్‌లర్ టి యాదగిరిరావు అన్నారు. తెయూ మైదానంలో గురువారం ఇంటర్ కాలేజ్ వాలీబాల్ మెన్ – ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను రిజిస్ట్రార్ ఎం యాదగిరితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందుకు అన్నిరకాల సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ.. విద్యతో సమానంగా క్రీడలను నిర్వహిస్తున్నామని, క్రీడలతో క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. టోర్నమెంట్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 13 కళాశాలల నుంచి పురుషులు, 11 కళాశాలల నుంచి మహిళా క్రీడాకారులు సుమారు 150 మంది పాల్గొన్నారని తెలిపారు. వాలీబాల్ పురుషుల విజేతగా తెయూ, రన్నర్‌గా నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల నిలిచింది. మహిళల విభాగంలో విజేతగా నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల, రన్నర్‌గా ఆర్మూర్‌లోని టీజీడబ్ల్యూఆర్డీసీ నిలిచింది. విజేతలకు డైరెక్టర్ డాక్టర్ జి బాలకృష్ణ మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్రట్ బీఆర్ నేత, పీడీలు డాక్టర్ బాలమణి, రమ, రూప, అంజలి, అనిల్‌కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment