మంత్రి రివ్యూపై ఆశలు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ దెబ్బతినగా, పలు చోట్ల తూముల పరిస్థితి అధ్వానంగా మారింది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల లైనింగ్ మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎస్సారెస్పీకి శుక్రవారం రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11.45 గంటలకు ఎస్సారెస్పీకి చేరుకోనున్న మంత్రి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు రివ్యూ కొనసాగనుంది. మంత్రి నిర్వహించనున్న సమీక్షపై ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలతో ఉన్నారు. ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించే దిశగా మంత్రి సమీక్ష చేపట్టాలని కోరుతున్నారు.
పడిపోయిన నీటి నిల్వ సామర్థ్యం
ప్రధానంగా పూడిక కారణంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయింది. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది వరదతోపాటు 0.8 టీఎంసీల పూడిక వస్తోంది. దీంతో ప్రాజెక్టులో భారీగా పూడిక నిండుతోంది. పూడిక తొలిగించే దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భవిష్యత్‌లో ఆయకట్టు పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు స్థిరీకరణ చేపట్టకపోవడం ఇబ్బందిగా మారింది.
అంధకారం
ఎస్సారెస్పీ చెంతనే విద్యుదుత్పత్తి అవుతున్నా డ్యాం పరిసరాలు మాత్రం అంధకారంలో మగ్గుతున్నాయి. ఆనకట్టపై ఉన్న లైట్లు ఒక్కటి కూడా వెలగడం లేదు. లైట్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు. విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. ప్రాజెక్ట్ ఆనకట్టపై పిచ్చి మొక్కలను తొలిగించేందుకు శాశ్వతమైన పరిష్కరం ఇప్పటికీ చూపించలేదు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలెన్నో ఉన్నాయి. జాతీయ రహదారి 44 నుంచి ప్రాజెక్ట్ వరకు ఉన్న రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ పని చేయడం లేదు. ప్రాజెక్ట్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పర్యాటకంగా ఎస్సారెస్పీ అభివృద్ధి చెందుతుందనే ఆశలు కలగానే మిగిలాయి.
సమస్యల వలయంలో
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
అధ్వానంగా మారిన కాలువల లైనింగ్
నేడు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాక
అధికారులతో సమీక్ష సమావేశం
నేడు నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవసరాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ప్రారంభించడానికి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం రానున్నారు. ఉదయం 10 గంటలకు గోర్గల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల వద్దకు వెళ్తారు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు హెడ్‌స్లూయిస్ వద్ద మంత్రి పర్యటన ఏర్పాట్లను నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment