రిజిస్ట్రేషన్ల నిబంధనలకు పాతర
సుభాష్‌నగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన 257 సర్క్యులర్‌ను సబ్ రిజిస్ట్రార్లు తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు పాతర వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రశీదులతో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్‌లో డబ్బులు ఇవ్వనిదే పని కావడంలేదని, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ చేయి తడపనిదే డాక్యుమెంట్ చేయడం లేదని డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు.
జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్, అర్బన్‌లో ఒక సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నారు. ఇటీవల బోధన్ మినహా నాలుగు చోట్ల సబ్ రిజిస్ట్రార్ల పనితీరుపై డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్‌లో 9 రోజులపాటు దుకాణాలు మూసి ఉంచారు. ఇదే క్రమంలో సదరు సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు సెలవులో వెళ్లడంతో డీఐజీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై ఆరోపణలు
నిజామాబాద్ అర్బన్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ చేయి తడపనిదే పనులు కావడం లేదని డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు. డాక్యుమెంట్ రైటర్లు తొమ్మిది రోజులపాటు నిరసన తెలపడంతో సబ్ రిజిస్ట్రార్ సెలవులో వెళ్లిన సంగతి తెలిసిందే. ఇన్‌చార్జి రాకతో డాక్యుమెంట్ రైటర్లు వెంటనే తమ కార్యాలయాలు తెరిచి రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేయిస్తున్నారు. వారం రోజుల సెలవుపై వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు తన సెలవును పొడిగించుకుంటూ వెళ్తుండడంతో ఆయన విధుల్లో చేరుతారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై ఆరోపణలు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు పూర్తిస్థాయి సబ్‌రిజిస్ట్రార్ తిరిగి విధుల్లో చేరడాన్ని ఇష్టపడడం లేదు. పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్ తిరిగి వస్తే తమకు అనుకూలమైన పనులు జరగవని ఉన్నతాధికారులపై పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను
రశీదులతో డాక్యుమెంట్లు
సర్క్యులర్ 257ని నీరుగారుస్తున్న
సబ్ రిజిస్ట్రార్లు
అందినకాడికి దండుకుంటున్న వైనం!
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
నిబంధనలు బేఖాతర్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇంటి అనుమతులు లేని, నాన్ లే అవుట్ ప్లాట్లు, ఒక ప్లాట్‌ను విభజించి రిజిస్ట్రేషన్ చేయొద్దని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020, ఆగస్టులో సర్క్యలర్ 257 తీసుకొచ్చింది. ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ, ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలను పాటించాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ పలువురు సబ్ రిజిస్ట్రార్లు వాటిని బేఖాతర్ చేస్తూ కేవలం ఇంటి పన్ను, విద్యుత్ బిల్లుల రశీదులతో డాక్యుమెంట్లు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment