లక్ష్యాన్ని మించి..
ఉమ్మడి జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. గతంలో నష్టాలలో ఉన్న ఆర్టీసీ డిపోలు ఇప్పుడు లక్ష్యాన్ని మించి లాభాల బాటలో పయనిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కో డిపోకు ప్రతి రోజూ సుమారు రూ. 9.68 లక్షల నుంచి రూ.15.75 లక్షల ఆదాయం వస్తుండగా, మొత్తం ఆరు డిపోల ద్వారా సమారు రూ.63.52 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.223.57 కోట్ల ఆదాయం వచ్చింది.
ఖలీల్‌వాడి: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆరు డిపోలు ఉండగా, 582 బస్సుల ద్వారా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. వీటిలో పల్లెవెలుగు 317, ఎక్స్‌ప్రెస్‌లు 114 బస్సులు ఉన్నాయి. రాజధాని, సూపర్‌లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు కలిపి 151 ఉండగా వీటిని ఎక్కువగా హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం ద్వారా 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 6 కోట్లకు పైగా మహిళలు ప్రయాణం చేశారు. ప్రతి రోజు ఈ పథకం ద్వారా సుమారు 1,70,528 మంది ప్రయాణం చేశారు. ఉమ్మడి జిల్లాలో 36 బస్టాండ్‌లు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులలో గతంలో 68 శాతం ఆక్యుపెన్సీ ఉండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఇప్పుడు 92 శాతం దాటింది.
కామారెడ్డి, బాన్సువాడ నుంచే అధికం
నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోలలో ఎక్కువగా కామారెడ్డి, బాన్సువాడ డిపోల నుంచి మహిళలు ప్రయాణిస్తున్నారు. కామారెడ్డి డిపో నుంచి ఇప్పటి వరకు 1,69,73,712 మంది, బాన్సువాడ డిపో నుంచి 1,01,22,310 మంది ప్రయాణం చేశారు. వీకెండ్స్, హాలీడేస్, పండుగ సమయాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా రోజుల్లో సాధారణ ప్రయాణం ఉంటుంది. ట్రాన్స్‌జెండర్ల సైతం మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు..
ఉమ్మడి జిల్లాలో ఆరు డిపోలు..
582 బస్సులు
రోజుకు సుమారు 1,70,528 మంది రాకపోకలు
ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో
6 కోట్ల మంది మహిళల ప్రయాణం
రూ.223.57 కోట్ల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment