నిజాంసాగర్ నీటి విడుదల
ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలి
బాల్కొండ: శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోని ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని భారీ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముప్కాల్ మండల కేంద్ర శివారులోని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంపు హౌస్‌లో ప్రాజెక్టు ఆయకట్టు జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసే కాలువల గుండా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులో పూడికను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తొలిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయకట్టు రైతుల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో ఆర్మూర్, కోరుట్ల, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, జుక్కల్ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, సంజయ్ కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మీకాంతా రావు, ఈఎన్‌సీ అనిల్‌కుమార్, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు.
నిజాంసాగర్: భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం బాన్సువాడ, బోధన్, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, లక్ష్మీకాంతారావులతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. అనంతర మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు నిర్మాణం విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు అక్కడి అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చూస్తానన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వానాకాలం, యాసంగి సీజన్లలో ముందస్తుగా పంటలు సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు, నాలుగు టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయిస్తే ఆయకట్టుకు మేలు జరుగుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అత్యంత వెనకబడిన జుక్కల్ నియోజకవర్గంలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నా 2,700 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. లెండి ప్రాజెక్టుతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయిస్తే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి మరమ్మతులు లేక కాలువలు శిథిలావస్థకు చేరాయన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment