గులాబీల పోరు.. మరింత జోరు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాల నిర్వహిణలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత స్పీడ్ పెంచుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజాపోరాటాల కార్యచరణతో ముందుకు సాగుతోంది. జిల్లాలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజా సమస్యల విషయమై అన్నీ తామై నడిపిస్తున్నారు. ఇప్పటివరకు వరుసగా రైతు రుణమాఫీ, ఎల్‌ఆర్‌ఎస్, ధాన్యం బోనస్, రైతుబంధు అమలు చేయాలని కోరుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలను ముందుకు నడిపించారు. ఇటీవల కొంతకాలం నుంచి ఎమ్మెల్సీ కవిత సైతం రెగ్యులర్‌గా జిల్లాలో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మండలాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్నారు.
బుస్సాపూర్ సభకు..
రైతుల ఆత్మహత్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీ మొదలు పెట్టిన యాత్ర శనివారం జిల్లాకు వచ్చింది. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని బుస్సాపూర్‌లో రైతులతో నిర్వహించిన సభకు మంచి స్పందన వచ్చింది. రైతులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా 409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని అన్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుంటే రేవంత్ సర్కార్ సోయిలేకుండా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కిరాయి కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. రైతులను నమ్మించి మోసం చేశారన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తుచేశారు. ప్రజాసమస్యల విషయమై పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో పోరుబాటకు దిగడంతో పార్టీ శ్రేణులు యాక్టివ్ అవుతున్నారు. నవీపేట మండలం మట్టయ్యఫారంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కేతావత్ పీర్‌చంద్ కుటుంబానికి వేముల ప్రశాంత్‌రెడ్డి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.
ప్రజాసమస్యలపై కార్యక్రమాలు
చేపడుతున్న బీఆర్‌ఎస్
రైతు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీ సభకు రైతుల నుంచి స్పందన
అన్నీ తామై వ్యవహరిస్తున్న
ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి
మరోవైపు జిల్లాలో కార్యక్రమాలు
పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత
Comments
Please login to add a commentAdd a comment