మిర్చి పంటకు సోకుతున్న తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖాధికారులు
మిర్చి రైతుకు
● తె గులుతో పుట్టి మునుగుతున్న రైతులు ● పంటను పూర్తిగా తొలగిస్తున్న వైనం ● వాతావరణ మార్పులే కారణమంటున్న అధికారులు
వీరులపాడు(నందిగామ): ప్రభుత్వం ఆదుకుంటున్నా.. తెగుళ్లు విడిచిపెట్టటం లేదు.. ఫలితంగా మిర్చి రైతుకు కన్నీరే మిగులుతోంది. ప్రస్తుతం బొబ్బర తెగులు శాపంగా మారుతోంది. ఎన్ని వ్యయ, ప్రయాసలకోర్చి సాగు చేసినా.. ఏదో ఒక రూపంలో పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.. గతేడాది వర్షాలు సకాలంలో కురిసి సమయానికి పంటలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పించి వారి ముఖాలలో చిరునవ్వులు పూయించింది. కానీ ఈ ఏడాది పంట ప్రారంభ సమయానికి వర్షాలు కురవకపోవటంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో మాగాణి సాగు పడకేయగా కురిసిన అడపా దడపా వర్షాలకు మిర్చి సాగు చేసిన రైతులకు బొబ్బర తెగులు కంటతడి పెట్టిస్తోంది.
సస్యరక్షణ చర్యలు పాటించాలి..
మిర్చి రైతులు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించటంతో పాటు సమగ్ర వ్యవసాయ సస్యరక్షణ చర్యలు పాటించటం వల్ల బొబ్బర తెగులు బారిన పడకుండా ఉండవచ్చని ఉద్యాన శాఖాధికారులు అంటున్నారు. ముఖ్యంగా పంట తొలిదశ నుంచి కాయ కోసే వరకు కూడా మిర్చి పంటలో ఈ వైరస్ వ్యాపిస్తుందని, పగటి సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా తెల్లదోమ ద్వారా ఒక్క మొక్క నుంచి మరొక మొక్కకు వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన మొక్కల లేత ఆకు లు చిన్నవిగా మారి ముడుసుకుపోయి ఉంటాయ ని, మొక్క ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య లేత ఆకుపచ్చ కానీ పసుపు పచ్చ రంగులో ఉండి ఈనెలు గట్టిగా ఉబ్బినట్లు ఉంటాయని తెలిపారు.
పంట నష్టం
మిర్చి పంటకు బొబ్బర తెగులు సోకటంతో రైతులు సాగు చేసిన మిర్చి పంటను తొలగిస్తున్నారు. వీరులపాడు మండల పరిధిలో చేపట్టిన మిర్చి సాగు మొదట బాగానే ఉన్నప్పటికీ.. 55 రోజుల తర్వాత బొబ్బర తెగులుతో పంట చేతికందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరులపాడు మండలంలోని చౌటపల్లి, జగన్నాథపురం గ్రామాలలో బొబ్బర తెగులు అధికంగా వ్యాపిస్తుండటంతో మిర్చి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు, కౌలు, తదితరాలతో లక్షలు వెచ్చించామని తెగులు సోకటంతో పంట మొత్తం తొలగించాల్సి వస్తోందని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment