ఓటుపై అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడంలో యువతీయువకులే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సూచించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం – భాగస్వామ్యం చేసే (స్వీప్) కార్యక్రమం మంగ ళవారం లబ్బీపేటలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రాంగణంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తమ కుటుంబ సభ్యులు, పరి సర ప్రాంతాల్లోని వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే విజయవాడ అర్బన్ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ అర్బన్‌లో 84 శాతానికి పైగా పోలింగ్ పెంచేందుకు వినూత్నంగా స్వీప్ కార్యక్రమాలు చేపడుతు న్నట్లు వెల్లడించారు. జిల్లాలో యువ ఓటర్ల నమోదుకు విద్యాసంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టినట్లు తెలిపారు. ఓటు, పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ (వీఐఎస్)లు పంపిణీచేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకునేలా సమ్మిళిత ఎన్నికల నిర్వహణ దిశగా కృషిచేస్తున్నట్లు వివరించారు. మొదటిసారి ఓటు పొందిన యువతకు ఉపయోగపడేలా కలెక్టర్ ఢిల్లీరావు స్వయంగా ఈవీఎంకు సంబంధించి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ గురించి విద్యార్థులకు వివరించారు. ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సీ–విజిల్‌తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ తదితర ఆన్‌లైన్ వేదికలు, ఫారం–6, 7, 8ల ప్రయోజనం గురించి అవగాహన కల్పించారు. కొత్తగా ఓటు నమోదుకు వీలుకల్పించే ఫారం–6 లను అధికారులతో కలిసి విద్యార్థులకు అందజే శారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి యు.శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్ టి.విజయ లక్ష్మి, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు దేవినేని మధుసూదనరావు, ఎన్నికల డెప్యూటీ తహసీల్దార్ ఎస్.వి.రవీంద్రనాథ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
Comments
Please login to add a commentAdd a comment