అడుగులో ఆరోగ్యం
నడకతో ప్రయోజనాలు ఎన్నో..
● నడక గుండెకు మంచిది. నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది.
● వేగంగా నడవడం వల్ల గుండె, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది.
● యాంగ్జయిటీ, డిప్రెషన్‌తో బాధపడే వారికి నడక మరింత మంచిది.
● రోజూ నడవడం వల్ల ఎముకలు మరింత పటిష్టంగా మారతాయి. కండరాలు కూడా పటిష్టమవుతాయి.
● నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.
● బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గం,
● నడకతో శరీరంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది.
● ఇన్సులిన్‌కు శరీరం స్పందించే తీరును కూడా నడక మెరుగుపరుస్తుంది.
● నడక కేవలం శరీర దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.
● వాకింగ్ సమయంలో శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల విటమిన్–డీ పుష్కలంగా లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
● నడకతో పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల 35 సంవత్సరాల వయస్సుకే గుండెపోటుతో మరణిస్తున్న వారిని చూస్తున్నాం. 40 ఏళ్లకే బ్రెయిన్ స్ట్రోక్ వస్తోంది. అంతేకాదు 45 ఏళ్లుకే మధుమేహం ప్రభావం కిడ్నీలపై చూపుతోంది. ఇటీవల కాలంలో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారే ఎక్కువగా వ్యాధులకు గురవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ జీవనశైలి వ్యాధులకు నడకతో అడ్డుకట్ట వేయొచ్చని సూచిస్తున్నారు.
వ్యాయామం లేకే అనారోగ్యం
వ్యాయామం లేకపోవడం, ఆధునిక జీవనశైలి యువత, మధ్య వయస్సువారిపై తీవ్రప్రభావం చూపుతోంది. అర్ధరాత్రి వరకూ ఫోన్‌లతో కాలక్షేపం చేయడం, పొద్దు పొడిచిన తర్వాత నిద్రలేచి హడావుడిగా విధులకు వెళ్లే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారు జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారు ఆకస్మిక గుండెపోటు మరణాలతో పాటు, మధుమేహం, రక్తపోటు దుష్ఫలితాలకు గురవుతున్నారు. 45 ఏళ్లు నిండిన వారు వాకింగ్‌పై ఆకస్తి చూపుతుండగా, యువత, మధ్యవయస్సు వారికి వ్యాయామం ఆసక్తి ఉండటం లేదు.
చిన్నప్పటి నుంచే వ్యాయామం అవసరం
ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో ఏ మాత్రం వ్యాయామం ఉండటం లేదు. కనీసం క్రీడా మైదానాలు కూడా ఉండటం లేదు. చదువు పూర్తయిన తర్వాత కూడా యువత వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో శరీరంలో కొలస్ట్రాల్ పెరిగిపోతోంది. ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చుకాక ట్రైగ్లిజరాయిడ్లు పెరిగిపోతున్నాయి. దీంతో గుండె జబ్బులతో పాటు, మధుమేహం, రక్తపోటు, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. యువత వ్యాయామంపై దృష్టి పెట్టకుంటే రానున్న రోజుల్లో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారు జీవనశైలి వ్యాధులకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
45 ఏళ్లు దాటిన వారిలో వాకింగ్‌పై ఆసక్తి యువతా వాకింగ్ చేయాలంటున్న వైద్యులు జీవనశైలి వ్యాధులకు నడకతో అడ్డుకట్ట రక్తపోటు, మధుమేహం నియంత్రణ
వ్యాయామం ఇలా..
రోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు వాకింగ్ చేయాలి.
యువత, మధ్య వయస్సు వారు జాగింగ్ చేయడం మంచిది.
ఉదయం ఆరు నుంచి 8.30 గంటల మధ్య, సాయంత్రం 4.30 నుంచి సూర్యాస్తమయం వరకూ వాకింగ్ చేసేందుకు అనువైన సమయం.
వ్యాయామం కోసం జిమ్‌లకు వెళ్లడం కంటే వాకింగ్, జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి.
నడకతో మధుమేహం అదుపు
డయాబెటిక్ రోగులు వాకింగ్ చేయడం ఎంతో అవసరం. వాకింగ్‌తో శరీరంలోని చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అనేక అధ్యయ నాల్లో తేలింది. గుండె జబ్బులు, డయాబెటీస్, కాలేయ వ్యాధులకు అధిక కొలస్ట్రాల్ కారణం. ఇన్సులిన్‌కు శరీరంలో స్పందించే తీరును కూడా వాకింగ్ మెరుగుపరుస్తుంది. కార్డియో వాస్క్యులర్ ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. మథుమేహ సంబంధిత సమస్యల ప్రభావాన్ని నడకతో తగ్గించుకోవచ్చు. మధుమేహ రోగులు రోజుకు 30 నిమిషాలు, వారంలో ఐదు రోజులు తప్పకుండా వాకింగ్ చేయడం మంచిది.
– డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహనిపుణుడు
యువత జాగింగ్ చేయాలి
ఆహారంలో తీసుకునే క్యాలరీలు ఖర్చు కావాలంటే ప్రస్తుత తరుణంలో అన్ని వయస్సుల వారికి వ్యాయామం ఎంతో అవసరం. ముఖ్యంగా యువత వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా చిన్న వయస్సులోనే వ్యాధుల బారిన పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 50 ఏళ్లు నిండిన వారు వాకింగ్, యువత జాగింగ్ చేయాలి. జాగింగ్, వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు, రక్తపోటును అదుపు చేసుకోవచ్చు. జీర్ణసమస్యలను అధిగమించొచ్చు. ఒబెసిటీ బారిన పడకుండా చూసుకోవచ్చు.
– డాక్టర్ నిర్మలకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్
Comments
Please login to add a commentAdd a comment