ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థులు మరింత మెచ్చేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూ రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. కొత్త మెనూ రూపకల్పనలో విద్యార్థుల అభిరుచులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సృజన ఆధ్వర్యంలో మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంపై వర్క్‌షాప్ జరిగింది. ప్రస్తుతం అమలవుతున్న మెనూలో చేయాల్సిన మార్పులపై స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల చైర్మన్లు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కుక్ కమ్ హెల్పర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నెల 27న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల వివరాలను విద్యాశాఖ అధికారులు వివరించారు. మొత్తం 89,713 మంది విద్యార్థులకు 78,402 మంది హాజరుకాగా, వీరిలో 90.34 శాతం మేర అంటే 70,829 మంది మధ్యాహ్న భోజనం తిన్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ల అభిప్రాయాల ఆధారంగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. వర్క్‌షాప్‌లో డీఈవో యూవీ సుబ్బారావు, ఏడీ (మిడ్ డే మీల్స్) కేవీఎన్ కుమార్, న్యూట్రిషినిస్టు డా. సుష్మ, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల చైర్మన్లు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కుక్ కమ్ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓలు బాధ్యతల స్వీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)గా నియమితులైన కె. చైతన్య శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. చింతూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఇన్‌చార్జ్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేసిన కావూరి చైతన్యను సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ ఆర్డీఓగా నియమించారు.
ఉయ్యూరు ఆర్డీఓగా షారోన్
ఉయ్యూరు ఆర్డీఓగా బీఎస్‌హెచ్ షారోన్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మర్యాదపూర్వకంగా కృష్ణా కలెక్టర్ బాలాజీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment